Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు షాక్

ఏపీ సర్కారుకు షాక్
X

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తెలంగాణ సర్కారుకు చెప్పినట్లుగానే మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇది ఏపీ సర్కారుకు ఊహించని పరిణామం. సార్వత్రిక ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుంది. ఈ భయంతోనే సర్కారు పంచాయతీల గడువు ముగిసినా ఎన్నికలు పెట్ట కుండా ప్రత్యేక అధికారుల పాలన తెచ్చింది. అందులో భాగంగానే ఆగస్టు నెలలో జారీ చేసిన జీవో 90ని హైకోర్టు కొట్టివేసింది.

ఈ జీవోను సవాల్ చేస్తూ కొంత మంది మాజీ సర్పంచ్ లు హైకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏ మాత్రం సరైన విధానం కాదని..మూడు నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో అంటే..వచ్చే ఏడాది జనవరిలో సర్కారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలలు ముందుగానే. మరి ఏపీ ప్రభుత్వం అంతటి సాహసం చేస్తుందా? లేక ఏదో ఒక కారణం చెప్పి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తుందా?. అన్నది వేచిచూడాల్సిందే.

ప్రధానంగా ప్రతి గ్రామంలో టీడీపీ నేతలతో నింపిన జన్మభూమి కమిటీలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. గ్రామంలో ఏ ప్రభుత్వ పథకం లబ్దిదారులకు చేరాలన్నా ఈ కమిటీల సిఫారసు లేనిదే పని జరగని పరిస్థితి. ఈ కమిటీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జన్మభూమి కమిటీల ప్రభావం పడుతుందనే భయం అధికార టీడీపీలో ఉంది. అందుకే ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేయటానికే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. మరి ఇఫ్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కారు ఎలా ముందుకు వెళుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it