Telugu Gateway
Andhra Pradesh

పరామర్శకూ చంద్రబాబు పర్మిషన్ కావాలా!

పరామర్శకూ చంద్రబాబు పర్మిషన్ కావాలా!
X

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఏపీ సర్కారుకు ఎంత నష్టం చేస్తుందో తెలియదు కానీ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు మాత్రం సర్కారుకు నష్టం చేయటం ఖాయంగా కన్పిస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడిన తీరు చూసి అధికార, రాజకీయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతలు కొంత మంది సైతం చంద్రబాబు వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కెసీఆర్ దాడిలో గాయపడిన జగన్ ను ఫోన్ లో పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘటన జరిగిన వెంటనే స్పందించారరు. గవర్నర్ నరసింహన్ ఘటనపై ఆరా తీశారు. దాడికి గురైన జగన్ ను పరామర్శించేందుకు వీళ్ళందరికీ చంద్రబాబు పర్మిషన్ అవసరమా?. పరామర్శించటంలో తప్పేమి ఉంది. ఎందుకు చంద్రబాబు అంత ఉలికిపాటుకు గురవుతున్నారు?. కెసీఆర్, పవన్ కళ్యాణ్ పరామర్శించటం, దాడిని ఖండించటంతో దీని వెనక ప్రధాని మోడీ ఉన్నట్లు అయిపోతుందా?. సహచర నేత దాడిలో గాయపడితే పరామర్శించటం మానవత్వం కదా?. అందులో తప్పుపట్టాల్సింది ఏముంది?.

చంద్రబాబు చాలా గట్టిగా నమ్మే ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) ప్రతినిధి, సిటీ నటుడు శివాజీ ఇలాంటి దాడి జరుగుతుందని ఎంతో ముందే చెప్పారని సాక్ష్యాత్తూ చంద్రబాబునాయుడే విలేకరుల సమావేశంలో ప్రకటించారు కదా?. మరి శివాజీ అంత ముందుగా అలర్ట్ చేసినప్పుడు జగన్ పై దాడి జరగకుండా చూసి..ఆయనకు సానుభూతి రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ పైనే ఉంది కదా?. అంటే శివాజీ ఎంతో ముందుగా ఉప్పందించినా తాము ఫెయిల్ అని చంద్రబాబు అంగీకరించనట్లేనా?. ఏపీ ఇంటెలిజెన్స్..పోలీసు వర్గాలకు కూడా లేని నెట్ వర్క్ శివాజీకి ఉందని చంద్రబాబు నమ్ముతున్నారా?. దేశంలోనే తనను మించిన సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఏమి సందేశం పంపిస్తున్నారు.

తుని లో రైలు కాల్చివేత, రాజధానిలో పంటల కాల్చివేత, సాక్ష్యాత్తూ అసెంబ్లీ భవనంలో పైపులు కోశారనే కేసుల సంగతి సంవత్సరాలు గడుస్తున్నా సరిగ్గా తేల్చలేని..ఏపీ పోలీసులు గంటల వ్యవధిలోనే జగన్ పై దాడి కేసును చేధించారా?. కేవలం రాజకీయ కోణంలోనే ఈ విచారణ సాగిందా?. ఈ అంశంపై ఇప్పటికే అటు వైసీపీ, ఇటు టీడీపీలు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టేశాయి కూడా. గవర్నర్ డీజీపీకి ఫోన్ చేయటంపై కూడా చంద్రబాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు. సహజంగా అయితే గవర్నర్ ప్రభుత్వం నుంచే నివేదిక కోరాలి. కావాలనుకుంటే ఆయన నేరుగా మాట్లాడినా అభ్యంతరం చెప్పటానికి ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. జగన్ పై విమానాశ్రయంలో దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది.

Next Story
Share it