కెసీఆర్ భాష గేదెలు కాసేవాళ్ళు కూడా మాట్లాడరు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. అదే సమయంలో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థలకూ రేవంత్ రెడ్డి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని..లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి టీవీ9, టీ న్యూస్, నమస్తే తెలంగాణలను ఆయన టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం చంద్రబాబు రూ. 500 కోట్లు కాంగ్రెస్‌కు ఇచ్చాడంటున్న కేసీఆర్ తాను పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఎంత ఇచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బుధవారం తాను ఐటి విచారణకు హాజరైనప్పుడు ఐటీ అధికారుల మీడియాలో వచ్చిన కథనాలపైనే ప్రశ్నించారని తెలిపారు. విదేశాల్లో తనకు అకౌంట్స్ ఉన్నట్లు ఇచ్చిన తప్పుడు వార్తలపై 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆ సదరు మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ప్రభుత్వ రద్దు నాటి నుంచి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తీరు కల్లు తాగిన కోతికి తేలు కుడితే ఎగిరినట్లు ఉందని విమర్శించారు. యమధర్మారాజు దగ్గరకు పోయి అక్కడ గోలీలు ఆడి మరి వెనక్కు వచ్చి తెలంగాణ తెచ్చినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో 2009 నుంచి 2014 వరకు 3,152 కేసులు పెడితే 1150 కేసులు మాత్రమే ఉపసంహరించుకున్నారని తెలిపారు. అసెంబ్లీలో ఒక్క తీర్మానం ద్వారా అన్ని కేసులు ఎత్తేయవచ్చని,కానీ కేసీఆర్ తనకు కావాల్సిన వారిపై మాత్రమే ఉపసంహరించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ విద్యార్థి నేత మున్నూరు రవికి 6 నెలల జైలు శిక్ష పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులే తొలగించి మిగిలిన ఉద్యమకారులవి ఎందుకు ఉపసంహరించ లేదో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించాకే ఆయన కేంద్రమంత్రి, సీఎం, ఛానల్, పేపర్, కోట్ల ఆస్తులు సంపాదించారన్నారు. అలాగే హరీష్, కేటీఆర్ మంత్రులయ్యారని, కూతురు కవిత ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ సభ్యుడయ్యారని విమర్శించారు. ఎన్నికలు కేసీఆర్ Vs చంద్రబాబు మధ్య జరుగుతున్నట్లు టార్గెట్ చేస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పలేక సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, లోకేష్‌లకు కనీసం తెలంగాణలో ఓటు కూడా లేదని, ఆయన ఇక్కడ పోటీ చేయడని,కానీ తెలుగుదేశం బరాబర్ పోటీచేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే భయం కాబట్టే సీఎం పదవిలో ఉన్నామన్న సోయిలేక దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బాష ఊరిలో బర్లు కాసేవాడు కూడా మాట్లాడటం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఏదోలా మరోసారి గట్టెక్కేలా ప్రయత్నిస్తున్న కేసీఆర్ దుర్బుద్దిని ప్రజల్లో ఎండగడతామన్నారు. తెలంగాణలో పోటీచేసే వారు అంతా ఇక్కడి బిడ్డలేననని వ్యాఖ్యానించారు.