శ్రీదేవిగా ‘రకుల్ ఫస్ట్ లుక్’ విడుదల
ప్రచారమే నిజం అయింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ‘శ్రీదేవి’ పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ చేయనుంది. ఈ విషయాన్ని రకుల్ తాజాగా అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే ఎన్టీఆర్ చిత్ర యూనిట్ బుధవారం రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమాలో శ్రీదేవి లుక్ తో పోస్టర్ ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో ప్రతి పాత్రా ఓ పెద్ద సంచలనంగా మారనుంది. ముఖ్యంగా క్యారెక్టర్ల ఎంపిక కీలకంగా మారింది. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్, సావిత్రి పాత్రను నిత్యామీనన్, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్ ఇలా ఎంపిక చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై ఆసక్తిని రోజురోజుకూ పెంచుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ను బాలకృష్ణ స్వయంగా పోషించటంతోపాటు..చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ఈ బయోపిక్ కోసం ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందే తడిచే పాటను రీమేక్ చేస్తున్నారు. ఆ పాటలోని రకుల్ లుక్‌నే చిత్ర యూనిట్ విడుదల చేసింది.