కొడుకు పార్టీకి తల్లి విరాళం

జనసేన పార్టీకి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తల్లి అంజనీదేవీ విరాళం ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆమె నాలుగు లక్షల రూపాయల చెక్కను పవన్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె తనను కలసి పార్టీ నాయకులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో శ్రమ, కష్టంతో కూడుకున్నదని..పోలీసు కుటుంబాలకు అండగా నిలవాలని ఆమె కోరినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు మార్లు తన తండ్రి కానిస్టేబుల్ అనే విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తన భర్త వెంకట్రావు పోలీసు ఉద్యోగిగా పనిచేసినందున తనకు ఇప్పటికి పెన్షన్ వస్తోందని..ఆ పెన్షన్ డబ్బుతోనే తాను పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయానికి వచ్చిన తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నార్ పవన్ కళ్యాణ్. ఇటీవల వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి కొంత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ నవంబర్ 2 నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రజా పోరాటయాత్రను ప్రారంభించనున్నారు. జిల్లాలోని తుని నుంచి ఇది మొదలుకానుంది.నవంబర్ 9వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్
పర్యటన ఇప్పటికే ఖరారు అయింది.