Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ కు ‘మీడియా సెన్సార్’

పవన్ కళ్యాణ్ కు  ‘మీడియా సెన్సార్’
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో ‘సెన్సార్’ గురించి పూర్తి క్లారిటీ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి. ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి..ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. పవన్ ఇప్పుడు ‘మీడియా సెన్సార్’ను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు..వారి అవినీతి, ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలను పవన్ కళ్యాణ్ ప్రముఖంగా ప్రస్తావించినప్పుడు ఎంపిక చేసిన పత్రికలు ‘పవన్ కళ్యాణ్ స్పీచ్ ను సెన్సార్ ’చేసేస్తున్నాయి. ఉదాహరణకు ఏపీ ప్రభుత్వం ప్రజలను పోలవరం బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తోంది. అక్కడకు తరలించే వారికి భోజనాలు పెట్టేందుకు ఓ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్ కూడా ఏపీ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు’దే అని ఆరోపించారు పవన్. అంతే కాదు...పోలవరానికి ప్రజలను తీసుకెళ్ళి చూపించినట్లే అమరావతికి ప్రజలను బస్సుల్లో తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ చంద్రబాబు ఏమి కట్టారో ప్రజలు కూడా చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ పని ప్రభుత్వం చేయకపోతే తామే స్వయంగా చేస్తామని హెచ్చరించారు.’ ఈ కీలకమైన వ్యాఖ్యలను అగ్రశ్రేణి పత్రికలు సెన్సార్ చేసి తాము రక్షణగా నిలిచిన ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చిన చంద్రబాబు తనను మోడీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించటం ఏమిటని ప్రశ్నించారు. తామిద్దరం ఏమేమి మాట్లాడింది వీడియోలు ప్రదర్శిస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మాటలు మార్చి ఇప్పుడు దర్మపోరాట దీక్షలా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ చేసే విమర్శల్లో చాలా వరకూ ‘సెన్సార్’ అవుతునే ఉన్నాయి. పనికిమాలిన విషయాలపై గంటలకు గంటలు చర్చలు పెట్టే ఛానళ్ళు పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న కష్టాలపై ఎందుకు చర్చలు పెట్టరని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆ ప్రశ్నలు కూడా సెన్సార్ అయ్యాయి. తమకు నచ్చిన వారు అయితే రోజూ అవే విషయాలు మాట్లాడినా..బ్యానర్లు అవుతాయి..నచ్చకపోతే బ్యానర్ స్థాయి వార్త అయినా పత్రికల్లో..టీవీల్లో కన్పించదు. ఇదీ పత్రికల రాజకీయం.

Next Story
Share it