Telugu Gateway
Cinema

‘పందెంకోడి2’ రివ్యూ..కీర్తిసురేష్..వరలక్ష్మీలే సినిమాకు బలం

‘పందెంకోడి2’ రివ్యూ..కీర్తిసురేష్..వరలక్ష్మీలే సినిమాకు బలం
X

ఏ సినిమాకు అయినా కథతో పాటు..హీరోనే బలం. ఎందుకంటే ఎక్కువ శాతం సినిమాలు నడిచేది ఆయా హీరోలకు ఉన్న ఇమేజ్ ఆధారంగానే. కథలో దమ్ములేకపోతే ఎంత పెద్ద హీరో అయినా ఫట్ మనటం ఖాయం. ప్రేక్షకులు అలాంటి చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా?. అసలు విషయం ఏంటంటే విశాల్ హీరోగా నటించిన ‘పందెం కోడి’’ సినిమా గురించి చెప్పుకోవటానికే ఇదంతా. ఈ సినిమాలో హీరో విశాల్ అయినా సినిమాను నడిపించింది అంతా కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లే అని చెప్పొచ్చు. చిలిపి అమ్మాయిగా కీర్తి సురేష్ నటన ఈ సినిమాకు ఓ హైలెట్. ఎంతో ఈజ్ తో కీర్తి సురేష్ పందెంకోడి2లో సూపర్ మార్కులు కొట్టేసింది. నెగిటివ్ రోల్ లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ అయితే సూపర్భ్ అని చెప్పొచ్చు. తెలుగులో రమ్యకృష్ణకు ధీటుగా నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది.

హీరో విశాల్ యాక్షన్స్ సీన్స్ లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 2005లో రిలీజ్‌ అయి తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గానే ఈ పందెంకోడి2 తెరకెక్కింది. దసరా సందర్బంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రాజా రెడ్డి (రాజ్‌ కిరణ్‌) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) భర్త హత్యకు గురవుతాడు. తన భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు రాజా రెడ్డి అడ్డుపడటంతో గోపి అనే కుర్రాన్ని మాత్రం చంపలేకపోతారు. అందుకే ఆ కుర్రాన్ని కూడా జాతరలోనే చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది భవానీ. సినిమా అంతా ఈ జాతర చుట్టూనే తిరుగుతుంది. గోపీని చంపాలని భవనీ వర్గం చూడటం..అతన్ని రక్షించే క్రమంలో రాజారెడ్డి వర్గం మధ్య సాగే ఘర్షణే సినిమా అంతా. ఏడేళ్లుగా విదేశాల్లో చదువుకుంటూ.. గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు.

జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. రాజా రెడ్డి పాత్రలో రాజ్‌కిరణ్ ఒదిగిపోయారు. ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ ఆ పాత్రకు మరింత హుందాతనం తీసుకువచ్చాయి. ఫైట్స్ లోనూ రాజ్ కిరణ్ ఎంతో బాగా చేశారు. సినిమా అంతా తమిళ నేటివిటి ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకోవటం కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే పందెంకోడి2 సినిమా చూస్తే కీర్తిసురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ నటనల కోసమే చూడాలి.

రేటింగ్. 2.5/5

Next Story
Share it