Telugu Gateway
Politics

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత కరెక్టే

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత కరెక్టే
X

తమిళనాడు సర్కారుకు ఊరట. దినకరన్ వర్గానికి షాక్. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. దీంతో ముఖ్యమంత్రి పళనిస్వామికి ఊరట దక్కినట్లు అయింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మల్యేలపై అనర్హత వేటు వేయటం సబబేనని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. దినకరన్ వైపు వెళ్ళిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ విధించిన అనర్హత వేటును మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా.. తాజా హైకోర్టు తీర్పుతో సభ్యుల సంఖ్య 213కు పడిపోయింది. ఈ తీర్పుపై దినకరన్ స్పందిస్తూ..కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెబుతూనే..ఎమ్మెల్యేలతో సమావేశం అయి సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ పళని ప్రభుత్వానికి దక్కినట్టు అయింది. అనర్హత ఎదుర్కొన్న వారికి చెందిన 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితాల ఆధారంగా మళ్ళీ సమీకరణాలు మారిపోయే అవకాశముంది.

అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వీరిపై అనర్హత వేటు కేసులో గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీంతో విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించి.. అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది.

Next Story
Share it