టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టిన నాయిని వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను ఇరకాటంలో పడేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కు నువ్వు ఎంతో దగ్గర కదా? కనీసం మీ అల్లుడి టిక్కెట్ కూడా ఖరారు చేయించుకోలేదా? అంటూ తనను మిత్రులు అడుగుతున్నారని ఓ సమావేశంలో నాయిని బరస్ట్ అయ్యారు. అంతే కాదు తనకు కెసీఆర్ దగ్గర అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని..సమయం ఇవ్వగానే కలుస్తానని తెలిపారు. ఏకంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డే తనకు కెసీఆర్ అపాయింట్ మెంట్ దొరకటంలేదని బహిరంగంగా వ్యాఖ్యానించటం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో పాటు ఓ ఎన్నికల్లో పోటీకి తనకు పది కోట్లు ఇస్తానని కెసీఆర్ చెప్పినట్లు నాయిని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక అంతే నాయిని వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ అస్త్రంగా మార్చుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న
తన సహచరుడు అయిన నాయినికే కెసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదంటే ప్రగతి భవన్ లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి అంటూ వ్యాఖ్యానించారు.
ఈ విమర్శలు పార్టీలోని ఇరకాటంలోకి నెట్టడంతో నాయిని మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తాను పొరపాటున పది లక్షలకు బదులు పది కోట్లు అని ప్రకటించానని..దీన్ని సరిదిద్దాలని కోరారు. అంతే కాదు..కెసీఆర్ తనతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారని నాయిని వ్యాఖ్యానించారు. ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పినా అపాయింట్ మెంట్ ఇవ్వటంలేదనే సంకేతాలు పంపినట్లు అయింది. ఇదిలా ఉంటే నాయిని వ్యాఖ్యల ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుమోటాగా ఈ కేసు తీసుకోవాలని..లేదంటే తన ఫిర్యాదుyaaniపై అయినా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. మొత్తానికి నాయిని నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అస్త్రాలను అయితే అందించారు.