Telugu Gateway
Cinema

ఎన్నికల ఏడాదిలో టీడీపీకి ‘వర్మ షాక్’

ఎన్నికల ఏడాదిలో టీడీపీకి ‘వర్మ షాక్’
X

తెలుగుదేశం పార్టీకి ఇది ఊహించని షాక్. ఆగిపోయిందనుకున్న సినిమా మళ్ళీ పట్టాలెక్కుతోంది. ఓ వైపు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రాజకీయంగా ఎంతో కొంత తమకు మేలు చేస్తుందన్న ధీమాతో ఉంది అధికార తెలుగుదేశం పార్టీ. అది కూడా రెండు భాగాలుగా రానుంది. ఇప్పటివరకూ ఈ ప్రచారమే జోరుగా సాగింది. కానీ ఇప్పుడు వర్మ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కిస్తానని శపథం చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా స్పీడ్ గా సినిమాలు తెరకెక్కించటంలో వర్మ అందె వేసిన చేయి. బాలకృష్ణ చెప్పేది ఒక కోణం అయితే..వర్మ తెరకెక్కించబోయేది మరో కోణం. వర్మ కోణం సహజంగానే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి టీమ్ కు రుచించకపోవచ్చు. అయినా సినిమా ఆగే అవకాశాలు కన్పించటం లేదు. ఎన్టీఆర్ చరిత్రను నిజాలతో నిరూపించటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దశం అని వర్మ చెబుతున్నారు.

నిజాలు అంటే ఏమి ఉంటాయో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ సినిమాల్లో...రాజకీయాల్లో ఎలా ఎదిగిందీ బాలకృష్ణ చెబుతుంటే...ఎన్టీఆర్ ను ఎలా పదవీచ్యుతిడిని చేశారన్నది రామ్ గోపాల్ వర్మ చూపించబోతున్నారన్న మాట. ఇప్పటికే సోషల్ మీడియాలో వర్మ సినిమాపై టీడీపీ శ్రేణుల విమర్శల దాడి ప్రారంభం అయింది. ఇప్పుడు బయోపిక్ తో బాలకృష్ణ చెప్పేది అయినా...రామ్ గోపాల్ వర్మ చూపించే రియల్ కోణం అయినా ఓ తరానికి పూర్తిగా తెలిసినవే. కొత్త తరానికే వీటిపై అంతగా అవగాహన ఉండదు. అయితే వర్మ చూపించే కోణం ప్రభావం ఓటర్లపై ఏ మేరకు ఉంటుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. సహజంగా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో హంగామా చేసే టీడీపీ శ్రేణులే వర్మ సినిమాకు కావాల్సినంత ప్రచారం చేసి పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర వివరాలను వర్మ శుక్రవారం నాడు తిరుపతిలో వెల్లడించారు.

అందులో ముఖ్యాంశాలు.. ‘‘దివంగత ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను నిజాలతో నిరూపించడమే ఈ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ముఖ్య ఉద్దేశం. ఎంతోమంది నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతారు. అయితే ఒక్క ఎన్టీఆర్‌ మాత్రం రేయ్‌ అని పిలిచి, ఓట్లు వేయించుకున్నారు. ఆ పిలుపులో నిజాయతీ కనిపిస్తుంది. అప్పట్లో సినీ పరిశ్రమలో ఎంతో మంది అందమైన కథానాయికలు ఉన్నప్పటికీ లక్ష్మీపార్వతిని ఆయన వివాహం చేసుకోవడం నాకు పెద్ద సందిగ్ధం. చివరగా ఎన్టీఆర్‌ చనిపోకముందు ఆయన లక్ష్మీపార్వతి గురించి మాట్లాడిన మాటలు సాక్ష్యంగా నిలిచాయి. ఒకవైపు ఎన్టీఆర్‌ ఫొటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ తెలుగోడి సత్తాను చాటారు. నిజాల వెనక ఉన్న నిజాలను నిరూపించేందుకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. వాటిని కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మహా మనిషి జీవిత చరిత్రపై ఎంత మంది సినిమాలు తీసినా, స్వర్గంలో ఉన్న ఆయన ఆశీస్సులు మా సినిమాపైనే ఉంటాయి. నేను రాజకీయాల్లో ఒక్క ఎన్టీఆర్‌ని తప్ప ఎవరినీ అనుసరించలేదు. ఈ సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయడం ఖాయం. జనవరి 24న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌కి జరిగిన ద్రోహం, ఆయన మృతి వెనక దాగి ఉన్న నిజాలు బయటకు రావాలనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుంది. ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని అల్లుడు, సినిమా, సంపదలను కొడుకులు లాక్కున్నారు. ఆయనలో ఉన్న పట్టుదలను నాకు ఇచ్చి వెళ్లారు’. అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it