Telugu Gateway
Politics

కెసీఆర్ కు కోమటిరెడ్డి ఛాలెంజ్

కెసీఆర్ కు కోమటిరెడ్డి ఛాలెంజ్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ కు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పది సీట్లను గెలుచుకుంటుందని..తాను చెప్పిన అన్ని సీట్లు రాకపోతే గెలిచినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఈ సవాల్ కు కెసీఆర్, మంత్రి కెటీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. అంతే కాదు..తాము అధికారంలోకి వస్తే మిర్యాలగూడ ను కాలుష్యకాసారంగా మార్చే దామరచర్ల విద్యుత్ ప్లాంట్ ను మూసేస్తామని ప్రకటించారు. ఈ ప్లాంట్ సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ఎందుకు పెట్టలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌ ‘నల్లగొండలోని 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నాం’ అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రిని లేకుండా చేసి.. బతుకమ్మ చీరల గురించి కేసీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, టీడీపీల మహాకూటమిపై నల్లగొండ ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎ‌ల్‌బీసీ) సొరంగమార్గం పూర్తి చేస్తానని హామీనిచ్చిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఎస్ఎ‌ల్‌బీసీలో కమీషన్లు రావనే పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. నల్లగొండను నాశనం చేసిన కేసీఆర్‌ పతనానికై పనిచేస్తానని అన్నారు.

Next Story
Share it