Telugu Gateway
Andhra Pradesh

ఎన్టీఆర్ ఎటువైపు...రాజకీయమా..సినిమానా?!

ఎన్టీఆర్ ఎటువైపు...రాజకీయమా..సినిమానా?!
X

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. నో డౌట్ ఆయన సినిమావైపే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తారా?. తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఆయన సేవలను వాడుకోవాలని చూస్తుందా?. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా విజయోత్సవ వేడుకలో ఒకే వేదికపై బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కన్పించటంతో రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇది. మాటల్లో దూసుకుపోయే ఎన్టీఆర్ ఉంటే..అంతగా స్పీడ్ చూపలేని నారా లోకేష్ కు ఇబ్బంది అవుతుందనే అప్పట్లో వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ ను పక్కకు తప్పించారు. ఎన్టీఆర్ నే కాదు..హరికృష్ణ ను కూడా చాలా కాలం సైడ్ లైన్ చేసేశారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఆయన నిర్వహించిన పొలిట్ బ్యూరో బాధ్యతలు ఎన్టీఆర్ కు అప్పగించాలనే డిమాండ్ కొంత మంది టీడీపీ నేతల నుంచి వచ్చింది. అయినా పెద్దగా అధిష్టానం దీనిపై స్పందించలేదు. కొంత మంది అయితే కళ్యాణ్ రామ్ ను కూకట్ పల్లి వంటి చోట్ల బరిలోకి దింపి..తాము హరికృష్ణ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాలనే ప్రయత్నం ప్రారంభించారు. అయితే అటు నిర్మాతగా..ఇటు హీరోగా సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ పోటీకి ఆసక్తి చూపటం లేదు. ఇక ఎన్టీఆర్ కెరీర్ అయితే ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది.

వరసగా ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ హిట్స్ గానే నిలుస్తున్నాయి. ఈ తరుణంలో మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకునే ఆలోచన ఎన్టీఆర్ కు ఏ మాత్రం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే అయినా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు..ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ కు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాకపోయినా లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇఛ్చారని..కానీ అదే ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు మాత్రం మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన అసంతృప్తిని పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారని..అయినా ఆయన కూడా ‘సర్దుకు’పోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో నారా లోకేష్ హవానే నడుస్తోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ పార్టీలో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఏ మాత్రం లేవని చెబుతున్నారు. పైగా ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమాతో బిజీ కానున్నారు. ఆయనకు ప్రస్తుతం రాజకీయాలకు కేటాయించే సమయం లేదని చెబుతున్నారు. కానీ అరవింద సమేత విజయోత్సవంతో ఎన్టీఆర్ రాజకీయ పునరాగమనంపై మాత్రం చర్చోపచర్చలు సాగుతున్నాయి.

Next Story
Share it