Telugu Gateway
Cinema

బాబాయ్..అబ్బాయ్ ని కలిపిన ‘అరవింద సమేత’

బాబాయ్..అబ్బాయ్ ని కలిపిన ‘అరవింద సమేత’
X

సుదీర్ఘ విరామం తర్వాత నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపైకి వచ్చారు. ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసేలా చేసింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్ర విజయోత్సం సందర్భం దీనికి వేదిక అయింది. ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ దివంగత హరికృష్ణ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. టీడీపీలో ఆయన పాత్ర..మంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి పనుల గురించి ప్రస్తావించారు. టీడీపీలో ఓ శ్రామికుడిలా హరికృష్ణ పనిచేశారన్నారు. అన్నయ్య హరికృష్ణ చనిపోవటం తనను ఎంతో బాధించిందని అన్నారు. హరికృష్ణకు ముక్కుసూటి తనం ఎక్కువని... ధైర్యశాలి అని పేర్కొన్నారు. హరికృష్ణ మొరటు మనిషిలా కన్పిస్తారని..కానీ మనసు వెన్న అని పేర్కొన్నారు.

టీడీపీ పార్టీ స్థాపించిన తొలి రోజుల నుంచి హరికృష్ణ ఎన్టీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉండి అరవింద సమేత సినిమా చూడలేకపోయానన్నారు. ఎన్టీఆర్ పేరు వింటే తనకు ఒళ్లు జలదరిస్తుందని వ్యాఖ్యానించారు. తారక్ చేసిన సినిమాలు ఎవరి వల్ల కావని అన్నారు. మన సినిమాల్లో అన్నీ ఉండాలి. నవరసాలు ఉండాలి. ఎన్టీఆర్ మాట్లాడుతూ అరవింద సమేత వీరరాఘవ ప్రయత్నానికి మీ ఆశీస్సులు అందించిన అభిమాన సోదరులకు నా వందనాలు అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఎంతో శ్రద్దతో..నమ్మకంతో..ఎంతో జాగ్రత్తతో కొత్త ప్రయత్నానికి నాంది పలికిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రేక్షక దేవుళ్ళు వారి నమ్మకాన్ని ఉంచారు.

ఈ విజయదశమికి నల్లమబ్బులా కమ్మిన విషాదఛాయ లాంటి పరిస్థితులో ఉన్న తమకు ఓ వెలుగు తెచ్చారని వ్యాఖ్యానించారు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం ఇచ్చారు. మా ఇద్దరి కలను వాళ్ల భుజాలపై మోసింది సాంకేతిక నిపుణులే. వాళ్లందరాకీ అభినందనలు. మీరందరూ మమ్మల్ని చూస్తున్నారు. కానీ పల్లకి మోసింది వాళ్లు. మీతోనే కాదు..ఆ అనందాన్ని మా బాబాయ్ తో పంచుకుంటున్నామని తెలిపారు. నాన్న ఉండి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తారు. నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కలసి ఒకే వేదికపైకి రావటం ఎన్టీఆర్ అభిమానులతో పాటు..టీడీపీ శ్రేణులు కూడా కుషీకుషీగా ఉన్నాయి.

Next Story
Share it