ప్రాణహాని ఉందంటున్న జగన్ పై దాడి నిందితుడు

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమానాశ్రయంలో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. చాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో నిందితుడిని పోలీసులు విశాఖ కెజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. సమస్య ఏంటి అని అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్’ అని శ్రీనివాసరావు చెప్పటం విశేషం.