చంద్రబాబు ‘నారాసురుడు’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ‘నారాసురుడు’ అని వ్యాఖ్యానించారు. గతంలో రాక్షస మహిషాసురుడు ప్రజలను పీక్కుతినేవాడని.. ఇప్పడు ఏపీలో నారాసురుడు(చంద్రబాబు నాయుడు) ప్రజలను కాల్చుకు తింటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలెదుర్కొంటున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు తాము సాయం ఏమీ చేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ధ్వజమెత్తారు. కానీ ప్రచారం మాత్రం అడ్డగోలుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. రాక్షస మహిషాసురుడుకి, ఏపీ నారాసురుడికి ఎలాంటి పోలికలున్నాయో ప్రజలందరికీ తెలుసు అన్నారు. మోసం చేయడానికి ఆ రాక్షసుడు రూపాలు మార్చేవాడని..ఈ నారాసురుడు అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనుకాడడని ధ్వజమెత్తారు. నారాసురుడు అధికారంలో కరువు, కాటకాలు, ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి సభలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విలువలకు పట్టం కట్టిన బొబ్బిలి నేలపై ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూడమని ప్రజలను కోరుతున్నా. ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే చాలా మంది పేదవారు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల ఖర్చైనా పేద పిల్లందరిని ఉచితంగా చదివిస్తాం. హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా చేస్తాం.
చిన్న పిల్లలను స్కూల్కు పంపిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. బాబు వస్తే జాబు అన్నారు.. లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. జాబు రావడం దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. అధికారంలోకి రాగానే అవసరమైన టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం’అంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఓ పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరి..రాజీనామా చేయకుండానే ఏకంగా మంత్రి పదవి పొందారని సుజయ కృష్ణా రంగారావుపై విమర్శలు గుప్పించారు.
.