Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి మరో షాక్..సీఎం రమేష్ ఇంట్లో ఐటి దాడులు

టీడీపీకి మరో షాక్..సీఎం రమేష్ ఇంట్లో ఐటి దాడులు
X

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో ఐటి దాడులు సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం నోటీసులు ఇఛ్చిన ఐటి శాఖ ఇప్పుడు నేరుగా దాడులకు దిగింది. ఈ వారంలో మరిన్ని ఐటి దాడులు ఉంటాయనే విషయాన్ని ‘తెలుగు గేట్ వే.కామ్’ ముందే చెప్పింది. నోటీసులు ఇచ్చి దాడులు చేస్తారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. సీఎం రమేష్ కు చెందిన నివాసాలు..కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. తనిఖీల్లో భారీ ఎత్తున ఐటి అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే ఐటి శాఖ సీఎం రమేష్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌, విజయవాడ, కడపలో ఏకకాలం‍లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు సమాచారం.

ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం రమేష్ కు చెందిన కంపెనీలు భారీ ఎత్తున కాంట్రాక్ట్ లు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు... పలు కంపెనీలకు అంచనాలు అడ్డగోలుగా పెంచి కాంట్రాక్టులు కేటాయించటంతోపాటు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఏకంగా ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటి శాఖ దాడులకు దిగటం కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దాడులు మరిన్ని ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it