Telugu Gateway
Andhra Pradesh

అవినీతి సొమ్ము ‘పార్కింగ్ ప్లేస్’ ఓనర్లలో వణుకు!

అవినీతి సొమ్ము ‘పార్కింగ్ ప్లేస్’ ఓనర్లలో వణుకు!
X

వేల కోట్ల రూపాయల అవినీతి. కానీ ఎక్కడా ఏమీ కన్పించదు. కానీ అది ఎక్కడో ఓ చోట ‘పార్క్’ చేస్తారు. అది కంపెనీ కావొచ్చు. వ్యక్తి కావొచ్చు. స్వామీజీలు కావొచ్చు. రాజకీయ నాయకులకు..స్వామిజీల సంబంధాల వెనక ‘అవినీతి సొమ్ము’ పార్కింగ్ కూడా ఓ పెద్ద కీలక అంశంగా ఉందని కొంత మంది నేతలు బహిరంగంగానే చెబుతారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఐటి దాడుల వెనక అవినీతి సంపాదన ‘పార్కింగ్ ప్లేస్’లే కీలకం అని చెబుతున్నారు. కొంత మంది పెద్దలు తమ దోపిడీ సొమ్మును వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన నేతల కంపెనీల వద్ద పార్క్ చేశారు. ఇందులో ఓ మంత్రికి చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలను ఒక్కరి దగ్గరే పెట్టడం జరిగే పని కాదు. ఇందుకు దేశీయ మార్గాలతోపాటు అంతర్జాతీయ మార్గాలను కూడా ఎంచుకుంటారు. ఈ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారికి ‘విశేష నైపుణ్యమే’ ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

గత నాలుగేళ్ళుగా సాగునీటి ప్రాజెక్టులు...రాజధాని భూములు..నిర్మాణాలు..రహదారులు..గనులు..ఇసుక ఇలా ఒకేటేమిటి ఎన్నో వేల కోట్ల రూపాయాల అక్రమ సంపాదన సొమ్మును ఎవరి కంట పడకుండా ‘నిర్వహించటమే నైపుణ్యం’ అని చెబుతున్నారు. అయితే ఐటి అధికారులు మాత్రం పలు కంపెనీల వాస్తవ వ్యాపారం..అందులో జరిగిన అసహజ లావాదేవీలపై కన్నేశారు. వీటిని వెలికితీస్తే అసలైన దోషులు ఎవరో తేలనుంది. కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై ‘స్పష్టమైన ఆధారాలు’ ఉన్నాయని..వాటి ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భవిష్యత్ లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావటం ఖాయం అని ఓ అధికారి తెలిపారు.

Next Story
Share it