Telugu Gateway
Telangana

తెలంగాణలో ఈ సారి ‘హంగ్’ తప్పదా?!

తెలంగాణలో ఈ సారి ‘హంగ్’ తప్పదా?!
X

తెలంగాణలో ఈ సారి ‘హంగ్’ తప్పదా?. రాజకీయ వర్గాల్లో ఇప్పుడదే హాట్ టాపిక్. నిన్న మొన్నటి వరకూ ద్విముఖ పోటీనే అనుకున్నా..అది కాస్తా ఇప్పుడు ‘త్రిముఖ’ పోటీగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. తిరిగి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బిజెపి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటూ వస్తోంది. అయితే బిజెపి మాత్రం తాజాగా తన వ్యూహాం మార్చినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ ఓ వైపు మజ్లిస్ తో దోస్తీ చేస్తూనే..మరో వైపు తమతో కూడా స్నేహంగా ఉండటం బిజెపి నేతలకు ఏ మాత్రం రుచించటం లేదు. తమ అవసరం లేకుండా కెసీఆర్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే ‘రాజకీయం’గా తమకు ఏ మాత్రం లాభం ఉండదు కాబట్టి..ఎలాగైనా పది నుంచి పదిహేను సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది బిజెపి. ఇందుకు అన్ని ‘అస్త్రాల’ను ఉపయోగించటానికి సిద్ధమైంది. కెసీఆర్ ఏ మాత్రం నమ్మదగిన ‘మిత్రుడు’ కాదనే విషయం అటు ప్రధాని మోడీ, ఇటు అమిత్ షాకు చాలా స్పష్టంగా తెలుసని..అందుకే బిజెపి తన పని తాను చేసుకుపోతుందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

తెలంగాణలో 119 సీట్లకు పోటీచేస్తామని ఆ పార్టీ ప్రకటిస్తున్నా..ఫోకస్ మాత్రం ఎంపిక చేసిన సీట్లపైనే పెట్టబోతోంది. అది కూడా గెలిచే అవకాశం ఉన్న సీట్లను టార్గెట్ చేయటం..అన్ని పార్టీలో అసంతృప్తితో ఉన్న పట్టున్న నేతలను ‘పట్టుకోవటం’పైనే పార్టీ ఫోకస్ పెట్టింది. అలాంటి నేతలను అక్కున చేర్చుకోవటం ద్వారా సత్తా చాటాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రాబోయే రోజుల్లో బిజెపి దూకుడు మరింత పెరగటం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఒంటరిగా బరిలో దిగుతుంటే...మరో వైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ లు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సవాలే విసరనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కన్పించటం లేదని..‘హంగ్’ దిశగా అసెంబ్లీ అడుగులు వేస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి.టీఆర్ఎఎస్ తమకు వంద..110 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ పార్టీకి ఏమంత అనుకూలంగా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it