ఓహ్...‘గాలి’లో విందు..ఆ అనుభూతే వేరు
గాలిలో విందా?. అదెలా సాధ్యం అన్నదే మీ సందేహామా?. దేశంలోనే మొదటిసారి అలాంటి అవకాశం బెంగుళూరు వాసులకు దక్కింది. ఓ ప్రైవేట్ సంస్థ ఈ ఏర్పాట్లు చేసింది. భూమికి 160 అడుగుల ఎత్తులో ఈ ‘ఫ్లై డైనింగ్ రెస్టారెంట్’ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ లో ఒకేసారి 22 మంది కూర్చుని విందు ఆరగించవచ్చు. వీరితో పాటు ఓ ఐదుగురు స్టాఫ్ కూడా ఉంటారు. మాక్ టైల్ సెషన్ కు అయితే ఒక్కో వ్యక్తికి 3999 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీని సమయం 30 నిమిషాలు మాత్రమే. మాక్ టైల్ అంటే నాన్ అల్కహాల్ డ్రింక్స్ అయిన ఫ్రూట్ జ్యూస్ , కూల్ డ్రింక్స్ తోపాటు స్నాక్స్ అందిస్తారు.
డిన్నర్ ఛార్జ్ మాత్రం 6999 రూపాయలు. దీని సమయం మాత్రం గంట. బెంగుళూరుకు చెందిన జంప్ కింగ్ ఇండియా సంస్థ ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. గాలిలో డెక్ పై కూర్చుని భోజనం చేసే వారికి ఎలాంటి భయాలు లేకుండా ‘బెల్ట్’ పెట్టుకోవాల్సి ఉంటుంది. వర్షాలు పడిన ఇబ్బంది లేకుండా..ఎండా కాలంలోనూ భోజనం చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైనా అసాధారణ పరిస్థితులు తలెత్తితే మాత్రం డెక్ ను బాగా కిందకు దింపుతారు. గర్భిణీ స్త్రీలు, 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను డెక్ లోకి అనుమతించరు.