Telugu Gateway
Telangana

కెసీఆర్ గెలుపు అంత ఈజీనా?!

కెసీఆర్ గెలుపు అంత ఈజీనా?!
X

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపు అంత ఈజీనా?. అంటే ఏ మాత్రం కాదని ‘లెక్కలు’ వేసుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ. ఇందుకు ఆ పార్టీ వేసుకున్న అంచనాలు కూడా హేతుబద్ధంగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ లెక్కలతోనే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఏ మాత్రం సాధ్యంకాదని కాంగ్రెస్ ధీమాగా ఉండటానికి ప్రధాన కారణాలు ఇవేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం.

  1. ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ అంటే మండిపడుతున్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులనుద్దేశించి సీఎం కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను తీవ్రంగా కలచివేశాయి. అంతే కాదు..ఇలాగే చేస్తే సంస్థను మూసివేస్తామని కెసీఆర్ హెచ్చరించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రం టీఆర్ఎస్ కు ఓటేయరు.
  2. టీఆర్ఎస్ కు మరో ప్రధాన మైనస్ పాయింట్ నిరుద్యోగ యువత. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నమ్మించారు. ఇంటికో ఉద్యోగం అని హామీ కూడా ఇచ్చారు. కానీ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. దీంతో యువత టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహాంతో ఉంది. కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినా అవి కోర్టు కేసులతో చిక్కుల్లో పడటం మరింత సమస్యగా మారింది. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి హామీ ఇస్తే..అసలు ఎంత మందికి ఇస్తారు..ఎలా వాళ్లను గుర్తిస్తారు..సాధ్యం అవుతుందా? అంటూ ప్రశ్నలు వేసిన కెసీఆర్ మళ్ళీ తమ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతిని చేర్చారు.
  3. తెలంగాణలోని టీచర్లు..ప్రభుత్వ ఉద్యోగులు కెసీఆర్ సర్కారుపై ఆగ్రహాంగా ఉన్నారు. మధ్యంతర భృతి ఇస్తామని ఊరించి..ఊరించి కనీసం ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడకపోవటంతో వాళ్లంతా టీఆర్ఎస్ పై మండిపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో ఉద్యోగులు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం లేదనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. దీనికి మరో బలమైన కారణం ఏంటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు కెసీఆర్ నో చెపితే..కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించింది. జిల్లాల పునర్విభజనతో చాలా చోట్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
  4. తెలంగాణలోని పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పూర్తయిన ఇళ్ళ సంఖ్య నామమాత్రమే. కొన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయినా..ప్రారంభం కావాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నికలపై ఇది కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అంచనా.
  5. తెలంగాణలో కౌలురైతులు ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ అంటే భగ్గుమనే పరిస్థితి. రైతు బంధు కింద ఎకరాకు నాలుగు వేల సాయం వ్యవసాయం చేసినా..చేయకపోయినా పట్టాదారులకే అంటూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీని వల్ల క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే లక్షలాది కౌలుదారులు ఈ పథకంలో లబ్ది పొందలేకపోయారు. వీరంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు టీఆర్ఎస్ కు ఎలాగూ ఓటు వేయరనే నమ్మకం కాంగ్రెస్ పార్టీది.
  6. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఈ ప్రాంతంలో ప్రజలు అసలు మంచినీళ్ళే తాగని చందంగా ఏకంగా తాగునీటి పథకం మిషన్ భగీరథ పేరుతో ఏకంగా 45 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టడం. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులు దీంతో పనికి రాకుండా పోయాయి. పోనీ భగీరథ అయినా పట్టాలెక్కిందా అంటే..ఇంకా కెసీఆర్ చెప్పినట్లు ఇళ్లకు నల్లాల ఏర్పాటు పూర్తి కాలేదు. ఈ పథకం పేరుతో సీసీ రోడ్లను కూడా తవ్వటంతో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. అటు నీళ్లు రాలేదు...ఇటు ఉన్న రోడ్లు కూడా పోయాయి?. దీంతో పలు చోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఎంపిక చేసిన కంపెనీలకు మేలు చేసి..ముడుపులు పొందటానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
  7. తెలంగాణకు అత్యంత కీలకమైన రాజధాని హైదరాబాద్ లో ‘టి హబ్’ తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్ ‘ముద్ర’ పడే ప్రాజెక్టు ఒక్కటీ లేదు. రహదారుల పరిస్థితి అంతే అస్తవ్యస్థం. మెట్రో రైలు ప్రారంభం అయినా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైందే. టీఆర్ఎస్ వల్ల ఏడాదికి పైగా జాప్యమే తప్ప..ఈ ప్రాజెక్టులో టీఆర్ఎస్ క్రెడిట్ ఏమీలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహార్మ్యాల ఫోటోలు విడుదల చేసినా ఒక్కటీ ముందుకు సాగలేదు. కొత్త రవీంద్రభారతి లేదు..కళాభవన్ లేదు. అన్నీ డిజైన్ల స్టేజీలోనే అటకెక్కాయి. స్కేవేల పరిస్థితి అంతే.
  8. సాగునీటి ప్రాజెక్టుల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు. అంచనాల పెంపుతో సాగిన దోపిడీ అంటూ కేసులు. ఇసుక స్కామ్. చేప పిల్లల పథకంలోనూ అవినీతి అంటూ ఆరోపణలు.

9.ముఖ్యమంత్రి కెసీఆర్ అసలు సచివాలయానికి రాకపోవటం ఉద్యోగులతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత పెంచింది. దేశంలో ఏ సీఎం చేయని తరహాలో నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన సచివాలయానికి అడుగుపెట్టింది అతి కొద్ది రోజులు మాత్రమే. ప్రగతి భవన్ కట్టాక మంత్రివర్గ సమావేశాలు, సమీక్షలు కూడా అక్కడే పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఆయన సామాన్య ప్రజల నుంచి ఒక్కటంటే ఒక్క వినతిపత్రం స్వీకరించింది లేదు. ప్రగతి భవన్ లో ప్రవేశం నిషేధం.

  1. గత ఎన్నికల్లో హామీ ఇఛ్చిన దళితులకు మూడెకరాల భూమి పరిస్థితి అంతంటే. అర్హులు ఎంతో మంది ఉండగా..ఈ పథకం కింద లబ్ది పొందిన వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఇది కూడా ఒకటి కానుంది.

సానుకూలతలు

కారణాలు ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎప్పుడో ఓ సారి తప్ప..పెద్దగా కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఒకప్పుడు విద్యుత్ కొరత ఉండగా..దేశమంతటా ఇప్పుడు మిగులు విద్యుత్ ఉండటం కూడా దీనికి ఓ కారణం. కెసీఆర్ కు కలసి వచ్చే అంశాలు ఏమిటంటే ఇప్పటికి అమలు చేసిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీ, కళ్యాణ లక్ష్మీ, పెన్షన్లు, కెసీఆర్ కిట్ వంటి పథకాలు కలసి రానున్నాయి.

Next Story
Share it