Telugu Gateway
Andhra Pradesh

బాబుకు ధర్మాబాద్ ఊరట..మోడీ సాయమేనా?!

బాబుకు ధర్మాబాద్ ఊరట..మోడీ సాయమేనా?!
X

ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయటంతో ఏపీ తెలుగుదేశం నేతలంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రత్యేక హోదా అడుగుతున్నందునే..మోడీతో పోరాడుతున్నందునే ఈ అరెస్ట్ వారంట్ అంటూ నానా హంగామా చేశారు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్నది బిజెపి ప్రభుత్వాలు కాదా? అంటూ లాజిక్ లు తీశారు. ప్రభుత్వాలు జడ్జిలకు చెప్పి ఆదేశాలు ఇప్పిస్తాయనే తీరులో దారుణంగా విమర్శలు గుప్పించారు. ఏకంగా కోర్టుకు కూడా ‘ఉద్దేశాలు ఆపాదించేలా’ చంద్రబాబు అండ్ కో దాడి ప్రారంభించింది. దీని వెనక మోడీ ఉన్నారని..తాము దేనినైనా ఎదుర్కొంటామని చెబుతూ చంద్రబాబు ను ఓ స్వాతంత్ర్య సమరయోధుడిలా ఓ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘మేం పోరాడింది తెలంగాణ ప్రయోజనాల కోసం. తెలంగాణ కోసం’ అవసరం అయితే చంద్రబాబు కోర్టుకు హాజరు అవుతారు అంటూ ప్రకటనలు చేశారు. కానీ చివరకు లాయర్ ను పంపి చేతులు దులుపుకున్నారు.

ధర్మాబాద్ కోర్టు కూడా చంద్రబాబు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వటంతోపాటు..నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ ను కూడా ఉపసంహరించుకుంది. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు అంతా ‘మౌనవ్రతాన్ని’ పాటిస్తున్నారు. అరెస్టు వారంట్ జారీ చేసినప్పుడు టీడీపీ నేతలు ఆరోపించినట్లు మోడీ కారణం అయితే..ఉపసంహరించుకోవటానికి కూడా చంద్రబాబు మోడీ సాయం తీసుకున్నారా?. నిజంగా ఆయన చేసిన పని అయితే...మరి ఉపసంహరణకు సహకరించేవారు కాదు కదా?. తన వరకూ వచ్చే సరికి వ్యవస్థలపై ఎంతటి ఆరోపణలు చేయటానికి అయినా చంద్రబాబు వెనకాడరు అని మరోసారి నిరూపించుకున్నారు. లాయర్ తో పిటీషన్ వేస్తే వారంట్ ఉపసంహరణ అవుతుందని అందరికీ తెలుసు. కానీ ప్రతి విషయాన్ని రాజకీయానికి వాడుకునే చంద్రబాబు ఈ సారి కూడా అదే పనిచేశారు. మరి ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఎలా వచ్చాయి.? టీడీపీ నేతల మౌనం వెనక మతలబు ఏమిటి?.

Next Story
Share it