Telugu Gateway
Politics

ప్రజాస్వామ్య అవసరమా.. రాజకీయ అవకాశవాదమా?

ప్రజాస్వామ్య అవసరమా.. రాజకీయ అవకాశవాదమా?
X

తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ‘ప్రజాస్వామ్య అవసరమా?. ఎలా?. ముందు కెసీఆర్ తో మాట్లాడుకుని..ఆయన కాదన్నాకే కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయినట్లు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే చెబుతున్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తు రాజకీయ అవసరం అవుతుంది తప్ప ...ప్రజస్వామ్య అవసరం..అనివార్యత ఎలా అవుతుంది?. కెసీఆర్ టీడీపీతో పొత్తుకు ఓకే అని ఉంటే..ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్య అనివార్యత ఎక్కడికి పోయేది?. ప్రతి అంశాన్ని అడ్డోగోలుగా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవటం..ఎంపిక చేసిన మీడియా ద్వారా ప్రచారం చేసుకోవటంలో చంద్రబాబు దిట్ట. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టకుండా మాట్లాడిన చంద్రబాబు అంతలోనే మాట మార్చారు. ఈ ప్రజాస్వామ్య అనివార్యత ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చింది?. మరి తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ప్రకటిస్తున్నారు కదా?. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎన్నో పిల్లిమొగ్గలు వేసి..చివరకు అదే శరణ్యం అంటూ మాట మార్చిన చంద్రబాబు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు వెనకాడుతున్నారు?.

అక్కడ లేదా ఈ ప్రజాస్వామ్య అనివార్యత?. ఏపీని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఓటర్లు తమ సత్తా ఏంటో చూపిస్తారని భయమా?. రాజకీయంగా నష్టపోతామే టెన్షనా?. బిజెపికి దూరం కావటంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో ముందుకు సాగటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. మరి పక్క రాష్ట్రంలో పొత్తుకు ఓకే అయిన పార్టీ..సొంత రాష్ట్రంలో ఎందుకు కాదు?. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అనుకూలంగానే పావులు కదుపుతున్నారు కదా?. ప్రజలు చంద్రబాబు చెప్పే ఈ ప్రజాస్వామ్య అనివార్యత మాటలను నమ్ముతారా?. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్ 11 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it