Telugu Gateway
Andhra Pradesh

అదే చంద్రబాబు..అదే స్కూల్!

అదే చంద్రబాబు..అదే స్కూల్!
X

పార్టీకి చెందిన నేత ఒకరు అడ్డగోలుగా మాట్లాడతారు. ఒక రోజు అంతా గడిచిపోతుంది. ఆ వార్త రాస్తే మా బాబుకు ఎక్కడ దెబ్బతగులుతుందో..నష్టం అవుతుందో అని ప్రధాన పత్రికలు కొన్ని ఆ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలకు చెందిన వార్తే అసలు అచ్చేయవు. కానీ ఇది జరిగిన 24 గంటల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ‘కవరింగ్ కామెంట్లు’ చేస్తారు. ‘ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దాడిపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మందలింపు. ఆయన వ్యాఖ్యలు హుందాగా లేవు. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పార్టీ వైఖరికి తగినట్లు హుందాగా వ్యవహరించాలి.’ అంటూ ఓ ప్రకటన. జగన్మోహన్ రెడ్డి హత్య వెనక ఆయన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల ఉన్నారని టీవీల సాక్షిగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

ఇవి పెద్ద కలకలం రేపాయి. టీడీపీ నేతలు..సానుభూతిపరులు సైతం రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై ఫీల్ అయి ఉంటే అదే రాత్రి ఖండన ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు గౌరవం ఉండి ఉండేది. కానీ తాపీగా 24 గంటల తర్వాత ఓ ఖండన ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. టీడీపీ వ్యవస్థల గురించి తెలిసిన వారెవరికైనా ఆ పార్టీ అధినేత ఆదేశాలు లేకుండా ఎవరూ నోరు విప్పరు. అలాంటిది రాజేంద్రప్రసాద్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే అది ఆయన సొంతం అని ఎవరైనా అనుకుంటారా?. చేయాల్సిన డ్యామేజీ చేసిన తర్వాత చంద్రబాబు తన పాత స్కూల్ ఖండన విడుదల చేశారు. అసలు వార్త రాయని వారు కూడా మహాప్రసాదంగా ఖండన మాత్రం కళ్ళకు అద్దుకున్నారు.

Next Story
Share it