Telugu Gateway
Andhra Pradesh

వంద కోట్ల నిధులు ‘మళ్ళించిన సీఎం రమేష్’

వంద కోట్ల నిధులు ‘మళ్ళించిన సీఎం రమేష్’
X

ఐటి దాడుల్లో నిగ్గుతేలిన నిజం

‘ ఓ ప్రకటనలో నేనా?. కాలేజ్ స్టూడెంటా? అని ప్రశ్నించినట్లు....అక్రమాలా?.మేమా? నో ఛాన్స్. ఐటి దాడులన్నీ రాజకీయ దాడులే. ఏపీపై దాడులే’. గత కొన్ని రోజులుగా టీడీపీ నేతల వరస ఇదీ. కానీ ఐటి దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు.. ఆ పార్టీ నేతలు చెప్పే మాటలకు మద్య పొంతన కుదరటం లేదు. అసలు విషయం వేరే ఉంది. ఈ విషయాన్ని ఐటి దాడులు నిగ్గుతేల్చుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెందిన కంపెనీ ఏకంగా వంద కోట్ల రూపాయలను ‘దారి మళ్ళించినట్లు’ ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్ లో ప్రముఖంగా ప్రచురించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దొంగ బిల్లులు..దొంగ కంపెనీలతో ఈ దందా సాగించినట్లు ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై టీడీపీ ఎంపీని ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ వివరణ కోరితే ఏమన్నారో తెలుసా?. నన్నెందుకు అడుగుతారు?. ఐటి వాళ్ళనే అడగండి అంటూ సమాధానం ఇచ్చారు.

ఈ నెల 12న ఐటి శాఖ అధికారులు సీఎం రమేష్ కు చెందిన కంపెనీలు, నివాసాలపై సోదాలు జరిపిన విషయం తెలిసిందే. సీఎం రమేష్ కుటుంబ సభ్యులకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ పీపీఎల్) 74 కోట్ల రూపాయల మేర నిధులను గుర్తించవీల్లేని లావాదేవీల ద్వారా తరలించినట్లు ఐటి శాఖ నివేదిక పేర్కొంది. మరో 25 కోట్ల బిల్లులు కూడా దొంగ బిల్లులుగా గుర్తించారు. నిధుల మళ్ళింపు కోసం ఆర్ పీపీఎల్ పలు దొంగ లావాదేవీలు జరిపినట్లు తేల్చారు. గత ఆరేళ్ళ కాలంలో ఈడీసీవో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కు సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా 12 కోట్ల రూపాయలు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించారు. కానీ రికార్డుల్లో చూపించిన నాలుగు అడ్రస్ ల్లోనూ కంపెనీ ఆనవాళ్ళు లేవు. ఈడీసీవో నుంచి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో సాయిబాబ్ పేరు ఉంది. ఆయన ఆర్ పీపీఎల్ అకౌంటెంట్. ఆయన దగ్గరే ఈడీసీవో స్టాంప్, సీల్ కూడా దొరికాయి. అంటే ఆయన్ను నిధుల తరలింపునకు వాడుకున్నట్లు అర్థం అవుతోందని ఐటి శాఖ తన నివేదికలో పేర్కొంది.

అదే సమయంలో మరో 33 కోట్ల లావాదేవీలకు సంబంధించిన అంశంలో 25 కోట్ల రూపాయల కొనుగోళ్ళను చూపించారు. అందులో 23 కోట్ల రూపాయలు నగదు రూపంలో వెనక్కి వచ్చింది. ఈ తేడాలను కంపెనీ అకౌంటెంట్ కానీ..డైరక్టర్ కానీ చెప్పలేకపోయారని పేర్కొన్నారు. అదే సయంలో స్టీల్ సప్లయిర్స్ నుంచి 12.24 కోట్ల రూపాయలు వచ్చినట్లు చూపించారు. నగదు లావాదేవీలపై వివరణ లేదు. స్టీల్ సరఫరాదారుల నుంచి 2 శాతం కమిషన్ వచ్చినట్లు చూపించారు. ఢిల్లీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ ఎన్ కెజీ కన్ స్ట్రక్షన్స్ కు 6 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు లెక్కల్లో చూపించారు. కానీ దీనికి సంబంధించి బిల్లులే లేవు. వీటితో పాటు ఎన్నో అనుమానపు లావాదేవీల వివరాలను ఐటి శాఖ అధికారులు తమ దాడుల సమయంలో గుర్తించినట్లు ఐటి శాఖ నివేదిక చెబుతోంది. మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం నేతలు ఐటి దాడులు ‘రాజకీయ ప్రేరేపితం’ అయినవే అని చెబుతారా?.

Next Story
Share it