బైక్ కొంటే నాటుకోడి ఫ్రీ అంట!
ఎవరైనా నాటు కోడి కోసం బైక్ కొంటారా?. బైక్ కొనేవారికి నాటు కోడి ఫ్రీగా ఇస్తామంటే?.. పెద్దగా పోయేది ఏముంటుంది?. అందుకే ఆ షోరూం ఓనర్ పండగ సందర్భంగా ఓ మంచి ఆఫర్ ప్రకటించేశారు. డిస్కౌంట్ సేల్స్...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్న పండగ ఆఫర్లు. ఇవన్నీ ఎప్పుడూ చూసేవే. కానీ ఈ వైరెటీ నాటుకోడి ఆఫరే ఆసక్తికరంగా ఉంది. ఈ వెరైటీ ఆఫర్ ఏంటి అంటే ప్రతి వాహనం కొనుగోలుపై ఓ నాటుకోడి ఉచితం అని ప్రకటించేశారు. అది కూడా అక్టోబర్ 11 నుంచి 19 వరకూ మాత్రమే. అంటే దసరా నవరాత్రుల బంఫర్ ఆఫర్ అన్న మాట ఇది. కోడి కాకుండా ఇంకా ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్.
అవేంటి అంటే ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై రెండు లీటర్ల పెట్రోల్ కూడా ఉచితమే నట. ఇది కూడా టెంప్టింగ్ ఆఫరే. ఎందుకంటే పెట్రోల్ రేటు ఒక్క రోజు కూడా ఆగకుండా అలా ముందుకెళుతూనే ఉంది కదా మరి. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తోట, ద్రాక్షారామం అని ఉంది. ఈ మెసేజ్ వాట్సప్ ల్లో చక్కర్లు కొడుతోంది. పండగ సీజన్ అందునా...నాటు కోడి అంటే ఎవరికైనా నోరూరుతుంది కదా?.