Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు షాక్...రిమాండ్ రిపోర్టుతో చిక్కులు!

చంద్రబాబుకు షాక్...రిమాండ్ రిపోర్టుతో చిక్కులు!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి షాక్. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు సాక్ష్యాత్తూ డీజీపీ కూడా దాడి చేసింది జగన్ అభిమానే అని ప్రకటించేశారు. పైగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి సానుభూతి పొందటం కోసమే జగన్ ఇలా ప్లాన్ చేశారని..దీని వెనక కుట్ర ఉందని..రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం అంటూ ఆరోపించారు. కానీ ఏపీ ప్రభుత్వ పోలీసులు సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్టు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ చెప్పిన దానికి భిన్నంగా ఉండటం సర్కారును చిక్కుల్లోకి నెడుతోంది. అది అంత డ్రామా అంటూ సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు చెప్పగా...ఇప్పుడు పోలీసులు ఏకంగా విమానాశ్రయంలో జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని తేల్చటంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల రిమాండ్ తో రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కన్పిస్తోంది. విమానాశ్రయంలో జరిగిన దాడిలో జగన్ కు మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో వైఎస్‌ జగన్‌ కుడివైపునకు తిరగడంతో హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారని అందులో వెల్లడించారు.

గత గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ వచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి ఆయన వీఐపీ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చిన జనిపల్లి శ్రీనివాసరావు కోళ్ల పందాలకు ఉపయోగించే పదునైన కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడి ఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రోటోకాల్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవ్‌ అక్కడే వున్నారని కూడా రిమాండ్‌ రిపోర్ట్‌ లో వెల్లడించారు. 25వ తేదీన వైఎస్‌ జగన్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారన్న సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్‌.. ఒక రోజు ముందుగానే కత్తులను ఎయిర్‌పోర్ట్‌ లోకి తెచ్చుకున్నాడని, సీసీ కెమెరాలు కవర్‌ చేయని ప్రాంతంలో ఆ కత్తులను దాచాడని రిమాండ్‌ రిపోర్ట్‌ లో వెల్లడించటంతో సర్కారు ఇంత కాలం చెబుతూ వస్తున్న విషయం తప్పని తేలిపోయింది.

Next Story
Share it