Telugu Gateway
Andhra Pradesh

ఆ పేర్లు చెప్పటానికి ఏపీ సర్కారుకు ఎందుకంత భయం!

ఆ పేర్లు చెప్పటానికి ఏపీ సర్కారుకు ఎందుకంత భయం!
X

దేశంలోనే ‘ప్రచారం’ విషయంలో పోటీలు పెడితే అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఢీకొట్టే వారే ఉండరు. అంతే కాదు..ఆయనకే ఈ విషయంలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎందుకంటే అది తుఫాన్ అయినా..వరదలు అయినా ఆయన వాడినంతగా ప్రచారానికి ఎవరూ వాడలేరు. అంత నైపుణ్యం ఉంది ఆయనకు ఈ విషయంలో. కానీ విచిత్రంగా అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఎప్పుడో ఖరారు అయిపోయాయి. కానీ ఎందుకో అధికారికంగా ఆ విషయంపై సర్కారు హంగామా చేయటం లేదు. సచివాలయ నిర్మాణం మొత్తం ఐదు టవర్లగా ఉండనుంది. ఇందులో జీఏడీ టవర్ 5 నిర్మాణ బాధ్యతలు ఎన్ సీసీ లిమిటెడ్ కు దక్కింది. ఈ టవర్ అంచనా విలువ 592.41 కోట్ల రూపాయలు. టవర్ 3,4 నిర్మాణ బాధ్యతలు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి దక్కించుకుంది. ఈ టవర్ల నిర్మాణ వ్యయం 749.90 కోట్ల రూపాయలు. టవర్ 1, 2 నిర్మాణ కాంట్రాక్ట్ షాపూర్జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి.

వీటి నిర్మాణ వ్యయం 932.46 కోట్ల రూపాయలు. మొత్తం శాశ్వత సచివాలయానికి సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణ వ్యయం 2274.77 కోట్ల రూపాయలు. శాశ్వత రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు సర్కారు ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ టెండర్లు అయితే ఖరారు అయ్యాయి కానీ ప్రభుత్వం మాత్రం వీటి విషయంలో ఎందుకు హంగామా చేయటం లేదా? అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ఏపీ రాజధాని అంతా సింగపూర్ కంపెనీలే కడతాయని పదే పదే ప్రకటించారు. ఏపీ ప్రజలకు వరల్డ్ బెస్ట్ ఇస్తామని తెలిపారు. స్లమ్స్ కట్టాలంటే స్థానిక కంపెనీలతో కట్టొచ్చు అంటూ ప్రతిష్టాత్మక దేశీయ సంస్థలను అవమానించారు.

సీన్ కట్ చేస్తే అత్యంత కీలకమైన సచివాలయ నిర్మాణ బాధ్యతలు అన్నీ దేశీయ కంపెనీలకే అప్పగించారు. మరి సింగపూర్ కంపెనీలు ఏమయ్యాయి?. అవి ఏమి కడతాయి?. అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అన్న భయంతోనే వీటిపై హడావుడి చేయటంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా ప్రధాన మీడియాలో సింహ భాగం చంద్రబాబు వైపే ఉన్నప్పుడు ఆయనకు ఏమవుతుంది. కావాలంటే తాము పనులు అప్పగించింది కూడా సింగపూర్ కంపెనీలకే అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజధాని నిర్మాణ పనులు సింగపూర్ కంపెనీలకు కాకుండా దేశీయ కంపెనీలకు ఎందుకు అప్పగించారో...చంద్రబాబు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it