Telugu Gateway
Politics

రాఫెల్ డాక్యుమెంట్లు అడిగినందుకే సీబీఐ డైరక్టర్ పై వేటు!

రాఫెల్ డాక్యుమెంట్లు అడిగినందుకే సీబీఐ డైరక్టర్ పై వేటు!
X

ప్రధాని నరేంద్రమోడీ సీబీఐ డైరక్టర్ పై అర్థరాత్రి వేటు వేయటం వెనక బలమైన కారణాలు ఉన్నాయా?. అవుననే అంటోంది ‘ది వైర్’ అనే వెబ్ సైట్. రాఫెల్ డీల్ కు సంబంధించిన పత్రాలు అడిగినందునే అలోక్ వర్మపై వేటు వేశారని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవటం ఖాయంగా కన్పిస్తోంది. ప్రధానికి సన్నిహితుడుగా పేరున్న రాకేష్ అస్థానా అరెస్టుకు ఆదేశాలు ఇచ్చినందుకు కాదు..వివాదస్సదమైన రాఫెల్ డీల్ వ్యవహారం గుట్టురట్టు కాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం తాజా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు వైర్ చెబుతోంది. గత వారమే రాకేష్ ఆస్థానాపై ఛార్జిషీట్ ఫైల్ చేసిన సీబీఐ ఆయన అరెస్టుకు అనుమతి కోరింది. కానీ పీఎంవో ఇంత వరకూ దానికి అనుమతి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడిన హై పవర్డ్ కొలీజియం అలోక్ వర్మను సీబీఐ డైరక్టర్ గా ఎంపిక చేసింది. ఇలాంటి వ్యక్తులకు కనీసం రెండేళ్ల పాటు గ్యారంటీగా పదవిలో కొనసాగుతారు. ఈ లెక్కన అలోక్ వర్మకు 2019 జనవరి వరకూ సమయం ఉంది. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించిన అంశంపై ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించేందుకు సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ రెడీ అయిపోయారు.

ఈ వ్యవహారానికి సంబంధించి బిజెపికి చెందిన కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీతో పాటు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ లు సీబీఐ వద్ద క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా సుప్రీంకోర్టులో ఉంది. వీళ్ళంతా సీబీఐ కి ఫిర్యాదు చేయటంతో పాటు భారీ ఎత్తున సమాచారాన్ని అందజేశారు. అయితే ఫిర్యాదు అందుకున్న వర్మ ఫిర్యాదుదారులు పేర్కొన్న అధికారిక డాక్యుమెంట్లు నిజమైనవేనా? అనే అంశంపై రక్షణ శాఖ నుంచి వివరాలు కోరారు. రక్షణ శాఖ నుంచి వర్మ డాక్యుమెంట్లు కోరటం..ఈ కేసుపై ఆయన ఆసక్తి చూపటంతో ప్రధాని నరేంద్రమోడీతోపాటు..ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న అజిత్ దోవల్ ప్రమాదం పొంచి ఉందని గ్రహించే వేటు వేశారని ఈ కథనం పేర్కొంది.

అంతే కాదు..గతంలో ఎన్నడూలేని విధంగా సీబీఐలో కీలక వ్యవస్థలను ధ్వంసం చేసి..ఇంటెలిజెన్స్ అధికారుల పేరుతో దాడులు నిర్వహించటం దారుణం అని పేర్కొంది. వర్మ ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలోనే సిఫారసు చేశారు. గతంలో ఎప్పుడూ ఐజీ స్థాయి అధికారి సీబీఐ డైరక్టర్ గా నియమితులు కాలేదు. అయితే నాగేశ్వరరావుపై చర్యలను మోడీ సర్కారు నియమించిన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కె వి చౌదరి అడ్డుకున్నారని ది వైర్ తెలిపింది. అంతే కాదు..బాధ్యతలు చేపట్టిన వెంటనే నాగేశ్వరరావు ఆస్థానా కేసును పరిశోధిస్తున్న వారందరినీ హెడ్ క్వార్టర్స్ బయటకు పంపేశారు. అంటే అంతా పక్కా పథకం ప్రకారమే సాగిందన్న రీతిలో వైర్ కథనం ఉంది.

Next Story
Share it