Telugu Gateway
Telangana

అమిత్ షాపై...‘ఆ ఎటాక్ ఏది?’

అమిత్ షాపై...‘ఆ ఎటాక్ ఏది?’
X

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ సారి తెలంగాణకు వచ్చి కేంద్రం అంత ఇచ్చింది.. ఇంత ఇచ్చింది అని ఓ లెక్కలు చెప్పేశారు. అంతే తెలంగాణ సీఎం కెసీఆర్ విలేకరుల సమావేశం పెట్టి బహుశా దేశంలో ఎవరూ చేయని స్థాయిలో ‘అమిత్ షా’పై రాజకీయ దాడి చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది కూడా. అసలు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేది ఏంది?. మేమే..ఓ నాలుగైదు రాష్ట్రాలే కేంద్రాన్ని సాకుతున్నాం అంటూ ఓ స్థాయిలో దుమ్ముదులిపేశారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఢిల్లీలోని మోడీ సర్కారుతో కెసీఆర్ సయోధ్య ప్రారంభం అయింది. ఎన్నికల వేళ మళ్ళీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వచ్చారు. మీడియాతో పాటు బహిరంగ సభలోనూ కెసీఆర్, ఆయన ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో దళితుడికి సీఎం పదవి ఇస్తామని మోసం చేశారు..ఈ సారైనా ఇస్తారా? లేక కొడుకును సీఎం చేస్తారా? అంటూ కెసీఆర్ ను అమిత్ షా ప్రశ్నించారు. అంతే కాదు..జమిలి ఎన్నికలకు మద్దతు పలికిన కెసీఆర్ ఎందుకు ముందస్తుకు వెళుతున్నారు..రాష్ట్రంపై అనవసరపు ఆర్థిక భారం మోపటం వెనక కారణమేంటి? అని ప్రశ్నించారు.

అయితే అమిత్ షా ఎక్కడ కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల్లో అవినీతిపై పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భం లేదు. స్థానిక నాయకులు సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి, తదితర అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు కానీ...అమిత్ షా మాత్రం ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించారనే చెప్పుకోవచ్చు. అయితే అమిత్ షా విమర్శలపై తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. అమిత్ షాను కేవలం ‘భ్రమిత్ షా’ అంటూ ఎద్దేవా చేస్తూ..గతంలో బిజెపి ముందస్తు ఎన్నికలకు పోయిన సంగతి గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మినహా పలు అంశాలపై అమిత్ షా పలు ప్రశ్నలు లేవనెత్తినా టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ మౌనంగా ఉండటం వెనక కారణం రెండు పార్టీల మధ్య ఉన్న ‘లోపాయికారీ’ అవగాహనే అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. నిజంగా అదేమీ లేకపోతే అమిత్ షా వ్యాఖ్యలపై కెసీఆర్ అంత మౌనంగా ఉంటారా? అన్న అనుమానం తలెత్తుతోంది.

Next Story
Share it