Telugu Gateway
Politics

తప్పులు సరిచేయకుండా ఎన్నికలా?

తప్పులు సరిచేయకుండా ఎన్నికలా?
X

తెలంగాణలో ఓటర్ల జాబితాలోని అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తప్పులు సరిదిద్దకుండా ఎన్నికలకు ఎలా వెళతారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కేంద్ర ఎన్నికల సంఘం పెద్దగా స్పందించటం లేదని వీరు ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి కూడా తెలంగాణ ఓటర్ల జాబితాపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి తర్వాతే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని సింఘ్వి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వక మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కోరుకుంటున్నారని విమర్శించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో 38 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరిగాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తీసేశారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అయినా ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 18 లక్షల ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 17లక్షల ఓట్లు తీసేశారు. ఖమ్మంలోని కొంతభాగం ఏపీలో కలిసింది. ఆ ప్రాంతంలోని ఓట్ల జాబితాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మొత్తం ఓటర్ల జాబితాలో 20 శాతం తప్పులున్నాయి.

Next Story
Share it