Telugu Gateway
Politics

ప్రతిపక్షంలా టీఆర్ఎస్..అధికార పార్టీలా కాంగ్రెస్

ప్రతిపక్షంలా టీఆర్ఎస్..అధికార పార్టీలా కాంగ్రెస్
X

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ తామేదో ప్రతిపక్షంలో ఉన్నట్లు 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరిపి సత్తా నిరూపించుకోవాలని హంగామా చేస్తోంది. ఈ సభ ద్వారా తామే తిరిగి అధికారంలోకి వస్తామనే సంకేతాలు పంపాలనే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని అభివృద్ధి తెలంగాణలో ఇఫ్పుడే జరిగిందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు ఉంది.. అందుకే ఎక్కడా బ్రేకులు లేకుండా నిత్యం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ప్రకటించుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఆదివారం నాడు జరిగే భారీ బహిరంగ సభలోనూ మరికొన్ని వరాల వర్షం కురిపించనున్నారు. ప్రజలకు ఎన్నో చేశామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ లో ఎందుకంత టెన్షన్. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరి ఉంటే..వారు నిజంగా లబ్దిపొంది ఉంటే ఇంత హంగామాతో సభ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుందా?.

లబ్దిదారులకు తమ ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదా?. కెసీఆర్ వందల కోట్ల రూపాయలు వెచ్చింది సభ నిర్వహిస్తేనే ప్రజలు గ్రహిస్తారా?. ఇవి అందరి మదిలో మెదిలే అనుమానాలు?. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే..అదో రకమైన పార్టీ అన్న ముద్రను కొనసాగిస్తోంది. తామే అధికారంలో ఉన్నట్లు...అధికారం తమకు కాకపోతే ఎవరికి వస్తుంది అన్నట్లు చాలా సో సోగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఓ వైపు ముందస్తు ఎన్నికల ముహుర్తం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని తరుణంలో ఇంకా కొంత మంది పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మారకపోతారా? అని చూసే పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. అయితే కాంగ్రెస్ ను ఒక్కతాటిపై నడిపించే నాయకుడే లేకుండా పోవటం ఆ పార్టీకి పెద్ద మైనస్ అయింది.

కొంత మంది సీనియర్ నేతలు అడపాదడపా ప్రభుత్వంపై విమర్శలు చేయటం మినహా..ఓ ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దగా పోరాటం చేస్తున్న దాఖలాలు లేవనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే విన్పిస్తున్నాయి. అధిష్టానం వైఖరి కూడా తెలంగాణ నేతల్లో సందిగ్ధతకు కొంత కారణం అని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారే తమకు అవకాశం వస్తుందని ధీమా ప్రదర్శించిన కాంగ్రెస్ కు గత ఎన్నికల్లోనే చావుదెబ్బ తగిలింది. ఇప్పుడు కూడా తాము ప్రతిపక్షంలో కాదు..అధికారంలో ఉన్నంత ధీమాతో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ ముందస్తు ఎన్నికల ఫలితాలు ఏమి తేలుస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it