Telugu Gateway
Cinema

మహామహులున్నా ‘మా’ భవనం కట్టుకోలేరా?

మహామహులున్నా ‘మా’ భవనం కట్టుకోలేరా?
X

టాలీవుడ్ లో టాప్ స్టార్లు ఎందరో. ఒక్కొక్కరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. కానీ టాప్ హీరోలు..నటులతోపాటు అందరూ ఉండే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు మాత్రం ఇప్పటివరకూ సొంత భవనం లేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నేటి శివాజీరాజా వరకూ ఎంతో మంది ‘మా’ అధ్యక్ష పదవులు నిర్వహించారు. పరిశ్రమలో కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే ఎంతో మంది మంది ఉండి కూడా ‘మా’ భవనం నిర్మాణం కోసం ఇంకా విరాళాలు సేకరించాలా?. పరిశ్రమ పెద్దలంతా ఒక్కటై కూర్చుంటే భవనానికి అవసరమైన స్థలం, భవన నిర్మాణ నిధులు సమకూర్చుకోలేరా?. ఇదే ఇఫ్పుడు పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. భవన నిర్మాణం కోసం మా అగ్ర నటులతో కార్యక్రమాలు పెట్టి నిధులు వసూలు చేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మురళీమోహన్ తోపాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కలసి ‘మా’ భవనానికి స్థలం కేటాయించాలని కోరారు.

ఆయన ఈ వినతిపత్రాన్ని తీసుకుంటూనే మురళీ మోహన్ ను పక్కన పెట్టుకుని మీరు నన్ను స్థలం అడుగుతారా? అంటూ నవ్వుతూనే చురక అంటించారు. ఎందుకంటే మురళీమోహన్ కు నగరంలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంక్ ఉందనే ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే తమిళనాడులో నడిగర్ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు కూడా ఈ మధ్యే మొదలయ్యాయి. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా విశాల్, కార్తీతోపాటు మరికొంత మంది నటులు ఓ సినిమాకు కాల్షీట్లు ఇఛ్చి..దాని ద్వారా వచ్చే డబ్బుతో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని తలపెట్టారు. టాలీవుడ్ లో కూడా అలాగే చేసుకోవచ్చని..లేదంటే భారీ మొత్తాల్లో రెమ్యునరేషన్ తీసుకునే వారి దగ్గర నుంచి కొంత వసూలు చేసి భవనం నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు కానీ..ఇలా ఎన్ని రోజులు హీరోలతో ఈవెంట్లు పెట్టించి నిధులు వసూలు చేస్తారు?.

ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే టాలీవుడ్ కు సంబంధించిన ‘మా’కు ఇప్పటివరకూ సొంత భవనం లేకపోవటం అనేది సిగ్గుచేటు అని పరిశ్రమలోని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు భవన నిర్మాణం కోసం అంటూ వసూలు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలతో ‘మా’లో కొత్త రచ్చ మొదలైంది. టాలీవుడ్ కు చెందిన కొంత మంది నటులు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ముందుకు రారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది ఒకెత్తు అయితే పరిశ్రమలో తామందరికీ పనికొచ్చే ‘మా’ భవనం విషయంలో కూడా ఇదే వైఖరా? అనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మా’ ఫిల్మ్ ఛాంబర్ లోని ఓ గదిలో కొనసాగుతోంది. అక్కడ సమావేశ మందిరాలను కూడా అనధికారికంగా వాడుకోవటమే తప్ప..సొంత సౌకర్యాలు ఏమీ లేవు. ఇదీ వెలుగు జిలుగుల టాలీవుడ్ పరిస్థితి.

Next Story
Share it