Telugu Gateway
Politics

ప్రధాన పార్టీలకు ‘సోషల్ మీడియా’ టెన్షన్!

ప్రధాన పార్టీలకు ‘సోషల్ మీడియా’ టెన్షన్!
X

ఎన్నికల వేళ సోషల్ మీడియాపై ఆంక్షలు పెడతారా?. ఫేస్ బుక్, వాట్సప్ సందేశాలను నియంత్రిస్తారా?. అయితే అది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు. కాకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని తాజాగా సంకేతిలిచ్చారు. అయితే ఇది ఏ రూపంలో ఉండబోతుందో వేచిచూడాల్సిందే. మొత్తానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మాత్రం ‘సోషల్ మీడియా’ టెన్షన్ పట్టుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా..తర్వాత వచ్చే లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా కీలకపాత్ర పోషించబోతోంది. అందుకే అధికార పార్టీలకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ప్రధాన మీడియా సంస్థలు కొన్ని ప్రభుత్వ పెద్దల చెప్పుచేతల్లోనే. లేదంటే పార్టీలకే పత్రికలు, టీవీలు ఉన్న వైనం మరో వైపు. అందుకే రాజకీయాలను ప్రభావితం చేసే వాటిలో ఇప్పుడు సోషల్ మీడియా కీలక పాత్ర పోషించబోతోంది. ఎలాంటి సర్వే..శాస్త్రీయ ప్రామాణికత లేకుండా ఓ పార్టీకి ఒకరు వంద సీట్లు వస్తాయని ఒకరు ప్రకటిస్తే..మరోకరు ఎనభై సీట్లు గ్యారంటీ అని ధీమా కల్పిస్తారు.

సోషల్ మీడియాలో అన్నీ ‘గాలి వార్తలే’ అని విమర్శించే వాళ్ళలో చాలా మంది ప్రధాన పత్రికల్లో వచ్చే ‘ప్యాకేజీ’ వార్తల గురించి మాట్లాడే సాహసం చేయరు. ఈ ప్యాకేజీ వార్తలపై ప్రతిపక్ష పార్టీలు కూడా నోరెత్తలేని పరిస్థితి. ఓ పత్రికనో..ఛానల్ నో విమర్శిస్తే ఎన్నికల సమయంలో తమను ఆయా పత్రికలు మరింత ‘టార్గెట్’ చేస్తాయనే భయం. అందుకే ప్రధాన ప్రతికల్లో వచ్చిన వార్తలు తప్పు అని స్పష్టంగా తెలిసినా..నోరు మెదపలేని దయనీయమైన స్థితి ఆయా పార్టీలు..నాయకులది. అంత మాత్రాన సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ వంద శాతం నిజమే అని ఎవరూ చెప్పరు. వ్యవస్థలు, యంత్రాంగం ఉన్న ప్రధాన మీడియానే ‘వక్ర మార్గం’ పడితే..కేవలం వ్యక్తులు..వ్యక్తిగతంగా చేసే వ్యాఖ్యలకు నియంత్రణ ఉంటుందనుకోవటం కూడా అత్యాశే అవుతుంది. అయితే ఏ పార్టీతో ఎవరైనా విభేదించొచ్చు. ఏ నాయకుడిపై అయినా విమర్శలు చేయవచ్చు. అయితే అది కేవలం అంశాలపైనే ఉండాలి. అంతే తప్ప పార్టీలను..నాయకులను వ్యక్తిగత దూషణలు..దుర్భాషలు ఆడితే ఎదురయ్యే పరిణామాలు కష్టమే.

ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలు తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్నికలకు 48 గంటల ముందు నుంచి సోషల్ మీడియాపై నియంత్రణ పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ డిమాండ్ ను చూస్తేనే వారు సోషల్ మీడియా అంటే ఎంత భయపడుతున్నారనే విషయం అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వారంటే ఖచ్చితంగా ఎంతో కొంత విద్యావంతులే ఉంటారు. ఆయా పార్టీలు డిమాండ్ చేసే సమయం కంటే ముందే ఎవరు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం అయిపోతుంది. కానీ ఎందుకంత టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో మీడియా చాలా వరకూ రెండు ప్రభుత్వాలు ప్రజలను ‘చల్లగా’ చూసుకుంటున్నాయనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అసలైన వార్తలు..ప్రభుత్వాల్లో జరిగే స్కామ్ లు కాస్తో..కూస్తో వెలుగు చూస్తున్నాయి అంటే అది సోషల్ మీడియా ద్వారానే. ‘ప్యాకేజీ’లు సమర్పించుకోలేని చాలా మంది నేతలు ‘సమర్థవంతం’గా తమ వాదనను సోషల్ మీడియా వేదికనే ఉపగియోంచుకుంటున్నారు. నిజంగా ఎవరేమి చెప్పినా ఆ అంశం ‘ప్రజలకు కనెక్ట్’ కానంత వరకూ పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రజలకు కనెక్ట్ అయితే మాత్రం అధికార పార్టీలు నష్టపోవటం పక్కా. ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో ఇప్పటికే రాజకీయం వేడి పుంజుకుంది. అధికార పార్టీల కంటే ప్రతిపక్షాలకే సోషల్ మీడియా ఓ శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుంది.

Next Story
Share it