Telugu Gateway
Andhra Pradesh

‘చంద్ర’మాయ..మరో 31 వేల కోట్ల ఉత్తుత్తి ఎంవోయు ఔట్!

‘చంద్ర’మాయ..మరో 31 వేల కోట్ల ఉత్తుత్తి ఎంవోయు ఔట్!
X

అవిగో ఎంవోయులు. ఇవిగో లక్షల కోట్ల పెట్టుబడులు. ఏపీలో ఇదో చంద్ర మాయ. ఎంవోయుల్లో చాలా వరకూ ఉత్తుత్తివే. వాటికే కోట్లాది రూపాయల ఖర్చుతో హంగామా. సంబరాలు. లెక్కలు చూసి మురుసుకోవటం. వాటినే ప్రచారం చేసుకోవటం. ఇదీ ఏపీ ప్రభుత్వం వరస. భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్న ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్ ల్యాండ్ కోల్ కార్పొరేషన్ ఏకంగా ఏపీలో 31,680 కోట్ల రూపాయల పెట్టుబడితో 5280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 2016 జనవరిలో ఈ ఎంవోయు జరిగింది. ఇప్పుడు ఏకంగా ఈ కంపెనీనే డీరిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకుంది. అంటే ఈ లెక్కన ఈ 31 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు హుష్ కాకి అన్నట్లే. 2008లోనే ఏర్పాటైన ఈ క్వీన్స్ ల్యాండ్ కోల్ కార్పొరేషన్ ఏకంగా 30 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు అనగానే ఒప్పందం అయితే చేసుకుంది. కానీ ఇఫ్పటివరకూ ఎలాంటి ప్రగతి లేదు. పైగా ఏకంగా ఇప్పుడు కంపెనీయే కనుమరుగయ్యే పరిస్థితి. 2016 జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఒక్క విద్యుత్ రంగంలోనే 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించిన ప్రతిపాదనలపై ఒప్పందాలు జరిగాయి. అందులో అడుగు ముందుకు పడినవీ ఏమీలేవనే చెప్పొచ్చు.

ఇదే తరహాలో చైనాకు చెందిన శానీ గ్రూప్ కూడా 3500 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎంవోయు చేసుకుంది. ఈ పెట్టుబడి 23500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో కూడా ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేదు. ఎల్ ఈపీల్ వెంచర్స్, ఇసోమెరిక్ హోల్డింగ్స్ బెర్హాద్ జాయింట్ వెంచర్ గా కృష్ణపట్నం ఓడరేవు వద్ద ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ (ఎఫ్ఎస్ఆర్ యు) టెర్మినల్ ఎంవోయు చేసుకున్నాయి. ఇది కూడా అడుగు ముందుకు పడలేదు. ఇలాంటి ఉత్తుత్తి ఎంవోయులు ఎన్నో. ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకునే వారితో పాటు ఎవరు కన్పిస్తే వారితో ఎంవోయులు చేసుకుని..పెట్టుబడుల విలువ పెంచుకోవటంతో పాటు...సంఖ్య పెంచుకునేందుకు హంగామా చేశారు. తీరా చూస్తే వాటి అమలు విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు. అసలు భాగస్వామ్య సదస్సు అంటే ఓ పెద్ద డ్రామాగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిజంగా సీరియస్ ఇన్వెస్టర్లు అయితే సదస్సుల కోసం ఎవరూ ఎదురుచూడరని..ఎక్కడ అవకాశం అక్కడకు వచ్చి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టు అమలు చేస్తాయని ఓ అధికారి వ్యాఖ్యనించారు. ఇదంతా కేవలం హైప్ కోసం సాగే హంగామానే అని తెలిపారు. అమలు కాని ప్రాజెక్టుల సంఖ్య...పెట్టుబడుల మొత్తం చూస్తుంటే ఇదే నిజం అన్పించక మానదు.

Next Story
Share it