పోలవరం పనులు పరిశీలించిన ‘దేవాన్ష్’!
నారా దేవాన్స్. తాను కడుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం నాడు స్వయంగా పరిశీలించారు. నారా దేవాన్ష్ ఏంటి?. పోలవరం కట్టడం ఏంటీ అంటారా?. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన మనవడిని ఏమి చేస్తున్నావని అడిగితే పోలవరం కడుతున్నానని చెప్పాడని వెల్లడించి అందరి కళ్లు తెరిపించారు. ఆ వార్త పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. దేవాన్ష్ కట్టే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు చంద్రబాబు ఆయనతో కలసి హెలికాప్టర్ లో వెళ్లారు. అమరావతి శంకుస్థాపన తరహాలోనే పోలవరం ప్రాజెక్టు సందర్శన కూడా చంద్రబాబు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ గా మార్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, దేవాన్ష్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దశను చంద్రబాబు ఓ పండగలా చేస్తూ ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయింది 55 నుంచి 60 శాతంలోపే. ఇప్పటికే చంద్రబాబు ఎన్నో జాతికి అంకితాలు..ప్రారంభోత్సవాలు చేశారు.
బుధవారం నాడు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు తన స్వీయ రాజకీయ, కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ‘షో’ చేస్తున్నారు. స్థానిక మీడియాలో వచ్చే వార్తలు సరిపోవటం లేదన్నట్లు ఏకంగా ఢిల్లీ నుంచి కూడా మీడియాను ఈ ఈవెంట్ కోసం తెప్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులు సగం పూర్తి అయితేనే ఇంత హంగామా చేస్తుంటే..ప్రాజెక్టు పూర్తి అయితే ఆయన ఏమి చేస్తారో అర్థం కాకుండా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించటం విశేషం. ప్రాజెక్టు ప్రాంతంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు కూడా చేశారు.