Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీని వదిలేసి.. చైనాలో నారా లోకేష్ చక్కర్లు

అసెంబ్లీని వదిలేసి.. చైనాలో నారా లోకేష్ చక్కర్లు
X

అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వరు. కార్యదర్శులు..ముఖ్య కార్యదర్శులు అనుమతి లేకుండా దేశంలో కూడా పర్యటించటానికి అనుమతించరు. ఎందుకంటే సభలో ఎప్పుడు ఏమి అవసరం వస్తుందో తెలియదు. అంతా పక్కాగా ఉంటాయి ఏర్పాట్లు. కానీ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, ఐటి, పంచాయతీరాజ్ ల శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలను వదిలేసి అలా చైనాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమా? మంత్రి విదేశీ పర్యటన ముఖ్యమా?. సహజంగా అయితే మంత్రి విదేశీ పర్యటనపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అసెంబ్లీ సమావేశాలను వదిలేసి..ఇలా చేయటం ఏ మాత్రం సరికాదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పెట్టుబడుల సాధన పేరుతో మంత్రి నారా లోకేష్ ఐటి శాఖకు చెందిన ఉన్నతాధికారులను వెంట పెట్టుకుని బీజింగ్ లో పర్యటిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే ఇలా చేయాలా?. తర్వాత అయితే పెట్టుబడులు రావా?. ఇప్పటికే అమెరికాతోపాటు పలు దేశాల్లో నారా లోకేష్ పర్యటించి వచ్చారు. అయినా వచ్చిన ఫలితం శూన్యం అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీని వదిలేసి లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్ళటం, అందుకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు తీరును పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ఓ వైపు అసెంబ్లీకి ప్రతిపక్ష వైసీపీ సభ్యులు రావటం లేదని విమర్శిస్తూ హంగామా చేస్తున్న నారా లోకేష్ ..అందుకు భిన్నంగా అసెంబ్లీని వదిలేసి..చైనాలో పర్యటన చేయటం విశేషం.

Next Story
Share it