Telugu Gateway
Andhra Pradesh

అమ్మ...లోకేషా!

అమ్మ...లోకేషా!
X

డబ్ల్యుఈఎఫ్ టిక్కెట్లు కొనుగోలు చేసి చైనాకు

పెట్టుబడుల సాధన కోసం అంటూ కలరింగ్

వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యుఈఎఫ్) న్యూ ఛాంపియన్స్ సమావేశానికి దేశంలో ఆహ్వానం అందుకున్న ఏకైక మంత్రి నారా లోకేష్. ఇదీ కొద్ది రోజుల క్రితం ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం హోరెత్తించిన ప్రచారం. నిజంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కు నిజంగా ఆహ్వానం అందిందా?. అసలు లోకేష్ లో ఏ క్వాలిటీ చూసి ఏకంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ చాంపియన్స్ సమావేశానికి ఆహ్వానించారు?. అని అరా తీస్తే అసలు విషయం తెలిసిపోయింది. ఈ సమావేశంలో పాల్గొనాలంటే భారీ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా అంత భారీ మొత్తం ఫీజు చెల్లించటానికి ఆసక్తి చూపలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ)కు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ ఈ భారీ మొత్తాన్ని ఈడీబీ తరపున చెల్లించి ‘స్లాట్’ బుక్ చేయించారు. అంత మొత్తంలో చెల్లింపులు చేసిన రాష్ట్రం నుంచి ఓ ప్రతినిధి పాల్గొనాల్సి ఉంటుంది. అందుకు ఆహ్వానం కూడా అందుతుంది. దీంతో లోకేష్ ది ఖచ్చితంగా కొనుగోలు చేసిన ఆహ్వానం అని తేలిపోయింది.

భారీగా డబ్బులు కట్టినందుకు గాను ఏపీ తరపున ఈడీబీ ప్రభుత్వంలో అనధికారికంగా నెంబర్ టూ స్థానంలో ఉన్న నారా లోకేష్ పేరు ఈ సమావేశానికి ప్రతిపాదించింది. అంతే ఆయనకు ఆహ్వానం అందింది. ఇదేదో ఏపీలో లోకేష్ పనితీరును మెచ్చో..లేక ఆయన ఉపన్యాస కళనచ్చో వచ్చిన ఆహ్వానం కాదని తేలిపోయింది. అయితే ఈ ఫీజు నిర్దిష్టంగా ఎంత చెల్లించారనే సమాచారం తెలియలేదు కానీ..ఇది భారీ మొత్తంలోనే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే తెలిసిపోయే అవకాశం ఉండటంతో ఈడీబీ మార్గం ద్వారా వ్యవహారాన్ని నడిపేశారు. ఈడీబీకి బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో నుంచే ఈ చెల్లింపులు చేశారు. దేశంలో ఏ సంపన్న రాష్ట్రం ప్రతినిధి కూడా చైనాలో జరుగుతున్న డబ్ల్యుఈఎఫ్ న్యూ చాంపియన్స్ సమావేశానికి డబ్బులు చెల్లించి హాజరవటానికి ఆసక్తి చూపలేదు.

కట్టుబట్టలతో వచ్చాం..కష్టపడి పనిచేస్తున్నాం అని కబుర్లు చెప్పే ఈ నేతలు మరి ప్రజల సొమ్ముతో ఇలా సమావేశపు టిక్కెట్లు కొనుక్కొని విదేశీ సమావేశాల్లో పాల్గొనాలా?. ఆయనతోపాటు అధికార బృందానికి విలాసవంతమైన విమాన, హోటళ్ళ ఖర్చులు అదనం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నారా లోకేష్ కూడా అచ్చం తన తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లు కన్పిస్తోంది. టిక్కెట్లు కొనుగోలు చేసి చైనా వెళ్లి పెట్టుబడుల సాధన కోసం అంటూ కలరింగ్ ఇవ్వటం విశేషం. అదీ కూడా కనీసం వెబ్ సైట్ లేని కంపెనీలతో ఎంవోయులు చేసుకుని హంగామా చేయటం. ఇదంతా ఎవరిని మభ్యపెట్టడానికి?.

Next Story
Share it