ప్రజల సొమ్ముతో ‘లోకేష్’కు ప్రచారం
ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మంత్రి నారా లోకేష్ ‘చొరబాటు’ ఇది. యువజన సంక్షేమ శాఖతో మంత్రి నారా లోకేష్ కు అసలు ఎలాంటి సంబంధం లేదు. నారా లోకేష్ నిర్వహించేవి ఐటి, పంచాయతీరాజ్ శాఖలే. నిరుద్యోగ భృతి గురించి ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను పక్కన పెట్టి ఆయనే ఎక్కువగా విధాన ప్రకటనలు చేస్తుంటారు. కేబినెట్ సమావేశపు నిర్ణయాలు వెల్లడిస్తుంటారు. తనకు ఇమేజ్ పెంచేవి..లాభం కలిగిస్తాయనుకుంటేనే లోకేష్ అలా మీడియా ముందుకు వస్తారు తప్ప..ఏదైనా ప్రతికూల అంశం వస్తే మాత్రం అటువైపు రారు. సరిగ్గా నిరుద్యోగ భృతి విషయంలోనూ అదే జరిగింది. శనివారం నాడు ప్రధాన పత్రికల్లో ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ఫుల్ పేజీల ప్రకటనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఈ ప్రకటన వెలువడింది. ఇందులోనూ లోకేష్ చొరబాటు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ యాడ్ లో కూడా అసలు ఏ మాత్రం సంబంధం లేని నారా లోకేష్ ఫోటో ముందు పెట్టి.. సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోను పక్కన పెట్టారు.
కేవలం ముఖ్యమంత్రి తనయుడు అయినందునే ఆయన ‘చొరబాటు’ సాగుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏది అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల సమ్మతి లేకుండా ముందుకు సాగటం లేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. యువతకు సంబంధించి నారా లోకేష్ ఓ ‘ఐకాన్’గా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రభుత్వ సొమ్ము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీని చంద్రబాబు ఎప్పటి నుంచో ఓ రాష్ట్రంలా కాకుండా ‘ఫ్యామిలీ’ కంపెనీ తరహాలో ట్రీట్ చేస్తూ ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువనేస్తం విషయంలోనూ అదే జరిగింది.