Telugu Gateway
Telangana

కూకట్ పల్లి నుంచి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ!

కూకట్ పల్లి నుంచి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ!
X

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తుకు లైన్ క్లియర్ అయింది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకులు ‘సేఫ్’ జోన్ ను వెతుక్కునే పనిలో పడ్డారు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఖరారు అయినా కరీంనగర్ లోని ఆయన సొంత నియోజకవర్గం జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కాదని రమణకు టిక్కెట్ దక్కే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అందుకే రమణ కూడా హైదరాబాద్ లోని కూకట్ పల్లి సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక్కడ వాతావరణం సహజంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది. మరో టీడీపీ నేత అరవింద్ కుమార్ గౌడ్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ ఉప్పల్ నుంచి బరిలో నిలవనున్నారు. టీడీపీ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని సీట్లపైనే కన్నేసింది. ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటంతో పాటు..రెండు పార్టీలు కలసి పోటీచేస్తున్నందున విజయావకాశాలు ఈజీ అని నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో టిడీపీ ఎక్కువ సీట్లను గెలిచింది గ్రేటర్ పరిధిలోనే కావటం విశేషం.

గెలిచే సీట్లనే చూసి ఎంపిక చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా తెలంగాణ తెలుగుదేశం నేతలు కూడా కాంగ్రెస్ కు గట్టి పట్టులేని..తమకు అనుకూలమైన నియోజకవర్గాలను ఎన్నుకునే క్రమంలో పడ్డారు. పొత్తు ద్వారా ఇలాంటి నియోకవర్గాలను ఎంపిక చేసుకుంటే గెలుపు ఛాన్స్ మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. సహజంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయ వైరం ఎక్కువ. మరి అలాంటి రెండు పార్టీలు కలిస్తే ఓటర్లు అంత ఈజీగా ఈ పార్టీల కలయికను ఆమోదిస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. మారిన పరిస్థితుల్లో టీడీపీ పొత్తు అనివార్యం అని భావిస్తోంది. అందులో భాగంగానే విమర్శలు ఎన్ని వస్తున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలతోకలసి ముందుకు సాగటానికే నిర్ణయించుకుంది.

Next Story
Share it