కెసీఆర్ కు కొంగరకలాన్ షాక్!
కరపత్రాలు (పాంఫ్లెట్స్) పంచటానికి పాతిక లక్షల మందితో సభ పెట్టాలని ఎవరైనా అనుకుంటారా?. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి..ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేయాలనుకున్న కెసీఆర్ లో ఎందుకంత నిస్తేజం..నిరుత్సాహం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వంద సీట్లు వస్తాయన్న కెసీఆర్ లో ఆ జోష్ ఏదీ?. కొంగరకలాన్ సభ ఎందుకంత చప్పగా...సో సో సాగిపోయింది. ఎన్నో ఆశలు...అంచనాలతో మొదలైన సభలో నిస్సారం ఆవహించటానికి కారణమేంటి?. టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన జనం..అందులో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ప్రసంగం చూసిన తర్వాత అందరూ నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పొచ్చు. ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సభలో మాట్లాడింది పాత కేసీఆరేనా? అన్న అనుమానం అందరిలో తలెత్తింది. ఎందుకంటే ఆ సభ అంత చప్పగా ముగిసింది. కాంగ్రెస్ పై మాట్లాడిన ఆ నాలుగు విమర్శలు కూడా లేకపోతే ఇది మరింత చప్పగా ఉండేది. ఈ సభకు హాజరైన జనాన్ని చూసి కెసీఆర్ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఆయన తన స్పీచ్ ముగియగానే వేదిక దిగి వెళ్లిపోయారు.
కనీసం ధన్యవాద తీర్మానం పూర్తయ్యే వరకూ కూడా వేదికపై ఉండలేదు. అత్యంత హైప్ క్రియేట్ చేసిన ఈ సభ పేరే ‘ప్రగతి నివేదిన సభ’. అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పి..మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెబుతారని ప్రకటించారు. అన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయని కెసీఆర్ సభా వేదిక నుంచే ప్రకటించారు. అంతే కాదు..సభకు హాజరైన వారికి కరపత్రాలు కూడా పంచామని చెప్పారు. కళాకారులు కూడా బాగా చెప్పారు అని వ్యాఖ్యానించారు. అంటే కేవలం కరపత్రాలు పంచేందుకు 25 లక్షల మందితో సభ పెట్టాలని అనుకున్నారా?. 25 లక్షల టార్గెట్ పెట్టుకుంటే సభకు హాజరైన వారి సంఖ్య కేవలం 4 నుంచి 5 లక్షల మధ్యలోనే ఉంటుందని పోలీసు వర్గాల నివేదిక. కెసీఆర్ తన ప్రసంగంలో ఎక్కువ సమయం తన నాలుగేళ్ళ పాలన కంటే తెలంగాణ రాక ముందు జరిగిన సంఘటనలపై చెప్పేందుకే ప్రయత్నించారు. కాస్తో..కూస్తో మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నమే కనపడింది. ఈ సభా వేదికపై కెసీఆర్ వ్యవహరించిన తీరు పార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటంలో కెసీఆర్ ను మించిన వారెవరూ లేరు?. అలాంటి కెసీఆర్ ఎందుకు ఇంత చప్పగా..ప్రసంగించారు అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న?.