‘రాజధాని’ ఎత్తిపోతల రెడీ
ఎత్తిపోతల పథకం అంటే...సహజంగా సాగునీటి అవసరాల కోసం చేపడతారు. కానీ ఇది అలాంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకం ఇది. అందుకే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అమరావతికి వరద ముంపును తప్పించి ఆ నీటిని తిరిగి నదికి లేదా కాలువకు మళ్లించ్చే విధంగా నిర్మించారు అదే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. దేశంలోనే ఈ తరహా పథకం ఇంతకు ముందెప్పుడూ నిర్మించలేదు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పనిని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. వరద సమయంలో ఈ వాగు నుంచి 5250 క్యూసెక్కుల నీటిని అంటే దాదాపు 0.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా 16 మోటార్లను 11 కెవి విద్యుత్ వినియోగించే విధంగా ఏర్పాటు చేశారు.
అమరావతి ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాల్లోని పంటలను కొండవీటి వాగు వరద ప్రవాహం ముంపునకు గురిచేసేది. ఇప్పుడు ఆ సమస్యకు కొండవీటి వాగు ఎత్తిపోత ద్వారా పరిష్కారం లభించింది. వరద ఎక్కువగా వచ్చినపుడు ఆ నీటిని కృష్ణా నదితో పాటు బకింగ్ హామ్ కాలువకు మళ్లించటం ద్వారా రాజధాని ప్రాంతం ముంపునకు గురికాకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. రూ.222.44 కోట్ల రూపాయతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నిర్మాణంలో సంస్థ ఎదుర్కొన్న సవాళ్లలో ప్రధానమైంది నీటి ఊట. ఎత్తిపోతల పథకం మూడు వైపులా నీళ్లు నిండి ఉన్నాయి. ఒకవైపు కృష్ణా నది, మరోవైపు బకింగ్ హామ్ కాలువ, మరోవైపు కొండవీటి వాగు. 365 రోజులు మూడు వైపులా నీరు నిల్వ ఉండే చోట ఈ ఎత్తిపోతల నిర్మాణ బాధ్యతలను ఎంఈఐఎల్ చేపట్టింది.
వర్షాలు పడినపుడు, ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు ఎక్కువ ఉన్నపుడు, బకింగ్ హామ్ కాలువకు నీటిని ఎక్కువగా వదిలినపుడు నీటి ఊట సమస్య మరింత ఎక్కువయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు 24X7 గంటలు జనరేటర్లను ఉపయోగించి 25 మోటార్లతో నీటిని ఎత్త్తిపోసింది. కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తాము ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఇదేనని మెయిల్ ప్రాజెక్ట్ మేనేజర్ అంబ జగన్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని ప్రాంతంలో కొన్ని పంటలు ముంపునకు గురయ్యాయి. ఈ ఎత్తిపోతల పని చేయటం ప్రారంభిస్తే ఇక ఆ సమస్య ఉండదు. ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా పంప్‌హౌస్, డిశ్చార్జి పాయింట్, రెగ్యులేటర్, సబ్‌స్టేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. పంప్ హౌస్ నిర్మాణం పూర్తయి 16 మోటార్లు, 16 పంపులు బిగించారు. ఒక్కో మోటార్ నుంచి 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా ఏర్పాటు చేశారు. 16 పంపుల్లో ఒకటి స్టాండ్ బై గా ఉంటుంది. ఏదైనా మోటార్ మరమ్మత్తు వచ్చినపుడు ఈ మోటార్‌ను వినియోగిస్తారు. 16 పంపుల్లో ఒక్కొక్కటి 300 ఆర్‌పీఎం అలాగే ఒక్కో మోటార్ 993 ఆర్‌పీఎం సామర్ధ్యం కలిగి ఉంది. ప్రతి పంప్ 1.6 కిలోవాట్ విద్యుత్ వినియోగిస్తుంది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా డిశ్చార్జి పాయింట్‌ను 23 అడుగుల ఎత్తున నిర్మించారు.
యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ నగరం నుంచి సీఎం అధికారిక నివాసం, తాత్కాలిక సచివాలయానికి రాకపోకలు సాధించేందుకు ప్రధాన రహదారిగా ఉన్న కరకట్టను పునరుద్దరించారు. డిశ్చార్జి పాయింట్, కరకట్ట మధ్యన, కరకట్ట, పంప్ హౌస్ మధ్యన ఉన్న ఖాళీ స్థలాన్ని అందమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు. డిశ్చార్జి పాయింట్ నుంచి కృష్ణా నది అందాలను సందర్శకులు తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తిపోత పథకం నిర్వహణకు ప్రధాన అవసరమైన విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ ఎత్తిపోతల పథకం నడిచేందుకు 132 బై 11 కెవి సామర్ధ్యం కలిగిన సబ్‌స్టేషన్ నిర్మించారు. సబ్‌స్టేషన్‌ను తాడేపల్లి ఫీడర్‌కు అనుసంధానం చేసేందేకు 22 టవర్లను నిర్మించి హైటెన్షన్ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందారు. ఏదైనా కారణాలతో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఎదురైతే మోటార్లు, పంపు నడిపేందుకు 1250 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన రెండు డీజిల్ జనరేటర్లను కూడా సిద్ధం చేశారు.