Telugu Gateway
Telangana

కెసీఆర్ జాతకమే తెలంగాణ ‘జాతకమా’!

కెసీఆర్ జాతకమే తెలంగాణ ‘జాతకమా’!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసలు రాష్ట్ర ప్రజలపై ముందస్తు ఎన్నికలు ఎందుకు రుద్దుతున్నారు?. 2018లో ఎన్నికలు పూర్తయితేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వస్తుందనే జ్యోతిష్యులు చెప్పిన మాటలే కారణమా?.లేక ఏమైనా హేతుబద్దమైన కారణాలు ఉన్నాయా?. కెసీఆర్ జాతకమే మొత్తం తెలంగాణ ప్రజల జాతకంగా భావించాలా?. చివరకు అసెంబ్లీ రద్దు కూడా ముహుర్త బలాలు..జాతకాల ప్రకారమే చేస్తారా?. మూఢనమ్మకాలకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సందేశాలు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు వచ్చిన రాజకీయ అస్థిరత ఏమీ లేదు. పాలన కూడా అంతా సాఫీగానే సాగుతుంది. నిత్యం ఎన్నికలు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని..వన్ నేషన్..వన్ ఎలక్షన్ ఎన్నికలపై చర్చ లేవనెత్తిన ప్రధాని మోడీ, బిజెపి లు ఎందుకు తెలంగాణ ముందస్తుకు మద్దతు తెలుపుతున్నాయి?. అసెంబ్లీ రద్దుతో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం?. మళ్ళీ మూడు..నాలుగు నెలల్లో అంటే..మార్చి..ఏప్రిల్ లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కదా?. విడివిడి ఎన్నికలతో అదనపు ఖర్చుతోపాటు..అభివృద్ధి ఆగిపోతుందని తెలిసి కూడా జమిలి ఎన్నికలకు జైకొట్టిన మోడీ, కెసీఆర్ లు ఎందుకు ముందుకు సాగుతున్నారు?. జమిలి ఎన్నికలు పెట్టడం లేదు కాబట్టి..మేం విడిగా అసెంబ్లీకి వెళతామంటే ఓకే అంటారా?. దీనికి సహేతుకమైన కారణాలు ఏమీ ఉండనవసరం లేదా?.

అటు బిజెపి, ఇటు టీఆర్ఎస్ ఓ అంగీకారంతో రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలపై రెండుసార్లు ఎన్నికలు రుద్దినా పర్వాలేదా?. అసెంబ్లీ రద్దు తర్వాత అయినా అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నదీ సీఎం కెసీఆర్ తెలంగాణ ప్రజలకు చెబుతారా?. లేక మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం..మీరు ఓటు వేయాల్సిందే అంటారా?. తెలంగాణ సచివాలయానికి వాస్తు బాగాలేదని అసలు సచివాలయానికి రావటమే మానేసిన సీఎం కెసీఆర్ దేశంలోనే ఓ కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ రద్దుకు కూడా ముహుర్తాలు.వర్జ్యాలు చూసి నిర్ణయం తీసుకుంటారా?. ప్రజల సమస్యలు..ప్రజల అవసరాలు..అభివృద్ధి కార్యక్రమాల వంటి అంశాలేమీ పట్టించుకోకుండా..కేవలం పాలకుడి సెంటిమెంట్లు...నమ్మకాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలంతా వాటికి ఆమోదం తెలపాల్సిందేనా?.

Next Story
Share it