Telugu Gateway
Telangana

ఆ 105లో కెసీఆర్ 15 సీట్లు మార్చేస్తారా?!

ఆ 105లో కెసీఆర్ 15 సీట్లు మార్చేస్తారా?!
X

అవుననే చెబుతున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అసెంబ్లీ రద్దు తర్వాత ఒకేసారి 105 మంది అభ్యర్దులను ప్రకటించి పెద్ద సంచలనం రేపారు టీఆర్ఎస్ అధినేత కెసీఆర్. ఈజాబితా ప్రకటించినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ అందరికీ బీ ఫాంలు ఇవ్వరనే అభిప్రాయం వ్యక్తం అవుతూ వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 105 మంది అభ్యర్దుల్లో కనీసం 15 మందికి టిక్కెట్లు కేటాయించే ఛాన్స్ లేదని చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం వెనక కారణం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఒకటి అయితే..ఆయా అభ్యర్ధులు సర్వేల్లో కూడా వెనకబడి ఉండటం మరో కారణంగా చూపిస్తున్నారు. అయితే అప్పటికే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ అభ్యర్దుల ఎంపిక పూర్తి అవుతుంది కాబట్టి..టిక్కెట్లు దక్కని వారు పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదనే అంచనాకు వస్తున్నారు నేతలు.

అయితే ఇలా చివరి నిమిషంలో టిక్కెట్ దక్కని వారు రెబెల్స్ గా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? అనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే ‘సర్దుబాటు’ చేసే అభ్యర్దులకు తలనొప్పి లేకుండా చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రికార్డు స్థాయిలో ఒకేసారి 105 మంది అభ్యర్దులను ప్రకటించి..తర్వాత జాబితాలో ఉన్న వారికి పదుల సంఖ్యలో బీఫాంలు నిరాకరిస్తే అది కెసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయం అని భావిస్తున్నారు. అయితే 105 మంది అభ్యర్దులను అలాగే కొనసాగిస్తే రాజకీయంగా నష్టం భారీగా ఉంటుందనే అభిప్రాయంతో కనీసం 15 మందికి అయినా చెక్ పెట్టేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ వెలువడి..నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి ఎన్ని మార్పులు..చేర్పులు ఉంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it