Telugu Gateway
Telangana

కెసీఆరే మళ్లీ వస్తారు నుంచి..కెసీఆర్ మళ్ళీ వస్తారా వరకూ!?

కెసీఆరే మళ్లీ వస్తారు నుంచి..కెసీఆర్ మళ్ళీ వస్తారా వరకూ!?
X

నిన్న మొన్నటివరకూ తెలంగాణలో ఒకటే చర్చ. కాంగ్రెస్ లో నాయకత్వ లేమి. అంతర్గత విభేదాలు. మళ్లీ కెసీఆరే వస్తారేమో?. ఎక్కువ మంది నుంచి విన్పించిన మాట ఇది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కూడా అధికార పార్టీకి ఓ పెద్ద సవాల్ గా మారనుంది. దీనికి తోడు సీఎం కెసీఆర్ లో ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశం ఏదైనా ఉంది అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకుని ఎవరికీ ఓ పట్టాన అందుబాటులోకి రారు. ఆయన కలవాలనుకుంటే తప్ప..ప్రగతి భవన్ లోకి ప్రవేశం ఎవరికీ అంత ఈజీ కాదు. సామాన్య ప్రజలకు అయితే అది జరిగే పని కాదు. సంక్షేమ పథకాలు..రైతులను ఆకట్టుకునే చర్యలతో మళ్ళీ కెసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ 25 లక్షల మంది అత్యంత అట్టహాసంగా తలపెట్టిన ‘ప్రగతి నివేదన సభ’ తుస్సు మనటంతో సీన్ రివర్స్ అయింది. మళ్లీ కెసీఆరే వస్తారేమో అనే పరిస్థితి నుంచి మళ్లీ కెసీఆర్ వస్తారా? అనే అనుమానాలు రేకెత్తించటానికి ఈ సభ కారణం అయింది. రాజకీయంగా ఇది టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సభకు హాజరు అనుకున్నదానికంటే బాగా తక్కువగా ఉన్నా..సీఎం కెసీఆర్ స్పీచ్ లో సహజమైన వాడి, వేడి లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రగతి నివేదన సభపై బయపడింది. సభ గ్రాండ్ సక్సెస్ అయితే ప్రజల్లో ఓ రకమైన మూడ్ వచ్చేస్తుందని భయపెడింది. కానీ విచిత్రంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి సభ పెట్టిన టీఆర్ఎస్ సరైన మెసేజ్ పంపటంలో విఫలం అయితే..ఇది కాంగ్రెస్ పార్టీకి లాభించిందనే చెప్పొచ్చు.

ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోవటం. కెసీఆర్ స్పీచ్ లో వాడి.వేడి లేకపోవటంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యంగా గతంలో ఎన్నడూలేని రీతిలో కెసీఆర్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే సభకు హాజరైన వారిలో చాలా మంది వెళ్లిపోవటం అనేది చరిత్రలో తొలిసారి జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సహజంగా స్పీచ్ లకు కెసీఆర్ పెట్టింది పేరు. అలాందిటి ప్రగతి నివేదిన సభలో మాత్రం ఈ జోష్ లేకుండా పోయింది. అందుకే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. కెసీఆర్ ఇక ఇంటికే అని కాంగ్రెస్ దూకుడు పెంచుతుంటే...కోదండరాం కూడా ప్రగతి నివేదన సభ కెసీఆర్ కు వీడ్కోలు సభ అని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దుకు రెడీ అవుతున్న కెసీఆర్ దీని వెనక గల కారణాలను అయినా ప్రజలకు చెబుతారా?. నా అసెంబ్లీ ..నా ఇష్టం అంటారా?. మరి ఓట్లు వేయాల్సిన ప్రజలకు కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా?. చూస్తుంటే తెలంగాణలో వాతావరణం అధికార పార్టీకి ప్రతికూలంగా ఉన్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it