Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డికి షాక్..ఐటి దాడులు

రేవంత్ రెడ్డికి షాక్..ఐటి దాడులు
X

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డికి షాక్. ఇటీవలే ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది. పదవి వచ్చి వారం రోజులు కూడా కాకుండానే గురువారం నాడు ఐటి దాడులు జరగటం విశేషం. ఓటుకు నోటు కేసులో ‘నగదు’కు సంబంధించిన అంశాన్ని చేధించాలంటూ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలకు లేఖ రాసిన విషయాన్ని ‘తెలుగుగేట్ వే. కామ్’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ లేఖకు స్పందనగానే ఇప్పుడు ఐటి దాడులు ప్రారంభం అయ్యాయి. ఐటి టీమ్ తోపాటు ఈడీకి చెందిన ప్రతినిధి కూడా ఒకరు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓటుకు నోటు కేసు రేవంత్ పై ఉన్న విషయం తెలిసిందే తాజాగా తెలంగాణ పోలీసులు జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల కేసును కూడా తెరపైకి తెచ్చారు. హైదరాబాద్‌లోని రేవంత్‌ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన 15మంది ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో ఉండటంతో ఆయా చోట్ల అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇటీవలే రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ప్రధాని మోడీతో కలసి తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ కేసులు పెట్టించే ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అందుకు బలంగా చేకూరుస్తూ ఐటి దాడులు జరగటం విశేషం. తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ అకస్మాత్తుగా రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా ఈడీ దాడులు జరగటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఈ దాడులతో తమకేమీ సంబంధం లేదని చెబుతోంది.

Next Story
Share it