Telugu Gateway
Politics

ప్రధాని మోడీకి ‘రాఫెల్ మరక’

ప్రధాని మోడీకి ‘రాఫెల్ మరక’
X

దేశ రక్షణ అంటే బిజెపి..బిజెపి అంటే దేశరక్షణ అన్నట్లు మాట్లాడతారు ఆ పార్టీ నేతలు. అలాంటిది బిజెపి ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన ‘రాఫెల్’ విమానాల కొనుగోలులో తీవ్ర ఆరోపణలు. అదీ ఏకంగా ప్రధాని మోడీకే ‘అవినీతి మరక’. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ మాజీ అధినేత సువర్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు రాఫెల్ విమానాల తయారీలో భాగస్వామ్యం అయ్యే సత్తా ఉన్నా తమను కాదని..రిలయన్స్ కు అప్పగించారని తెలిపారు. ఇదే పెద్ద కలకలం రేపుతున్న తరుణంలో ఫ్రాన్స్ మాజీ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండ్ తన వ్యాఖ్యలతో పెద్ద కలకలమే రేపారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ను భాగస్వామిగా పెట్టుకోమని డసాల్ట్ కు ప్రభుత్వమే చెప్పిందని..అందులో తమ పాత్రేమీలేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మోడీ సర్కారు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. హెచ్ ఏఎల్ మాజీ చీఫ్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ ప్రకటనలతో బిజెపి ఇరకాటంలో పడింది.

‘రాఫెల్ డీల్’ను రక్షణ శాఖపై మోడీ సర్కారు జరిపిన సర్జికల్ స్ట్రైయిక్ గా కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. అంతే కాదు..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా విలేకరుల సమావేశం పెట్టి మరీ ‘ఎటాక్’ ప్రారంభించారు. తాజా పరిణామాలతో చౌకీదార్ గా ఉంటానన్న వ్యక్తి ‘చోర్’ అని తేలిపోయిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది 30 వేల కోట్ల రూపాయల కుంభకోణం అని రాహుల్ ఆరోపించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ప్రధానిని దొంగ అంటున్నారు..అయినా మోడీ నుంచి ఒక్క మాట కూడా లేదని రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. 30 వేల కోట్ల గిఫ్ట్ ను మోడీ అనిల్ అంబానీకి ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చెప్పింది నిజమా? అబద్ధమా మోడీ దేశ ప్రజలకు చెప్పాలన్నారు.

రాఫెల్ ఒప్పందంపై స్వయంగా ప్రధాని మోడీనే సంతకాలు చేశారన్నారు. రక్షణ శాఖ మంత్రులుగా ఉన్న మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్ లో ఈ డీల్ పై సంతకాలు చేయలేదన్నారు. భారత ప్రజల జేబుల్లోని డబ్బులు తీసుకుని అనిల్ అంబానీ జేబులో వేశారన్నారు. దేశానికి రక్షణగా నిలవాల్సిన వ్యక్తే దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంత కాలం తమది ‘క్లీన్’ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్న బిజెపిని ‘రాఫెల్ మరక’ వెంటాడటం ఖాయంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇదే ప్రదాజ ఏజెండాగా మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it