ఎక్కువ అబద్ధాలు..తప్పుడు ప్రకటనల్లో కెసీఆర్ రికార్డు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అత్యధిక అబద్ధాలు..తప్పుడు ప్రకటనలు చేయటంలో కెసీఆర్ రికార్డు సృష్టించారన్నారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను నమ్మించిన కెసీఆర్ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండి కూడా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం పోరాడారని..కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి లేకపోతే తెలంగాణ సాధ్యమయ్యేది కాదని ఆజాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ పాత్రేమీలేదన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేస్తామని తమనూ కెసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
పార్లమెంట్ లో మోడీ సర్కారుకు కెసీఆర్ మద్దతు ఇస్తున్నారని..తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ హైదరాబాద్ , ఢిల్లీలో కూర్చుని ప్రకటనలు చేయటం తప్ప చేసిందేమీ లేదని ఆజాద్ ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంలోనూ కెసీఆర్ తీరును ఆజాద్ తప్పుపట్టారు. తొలుత ముస్లిం సోదరులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పటి సీఎం వైఎస్సార్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అయితే, సుప్రీం కోర్టు ఒప్పుకోకపోవడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. వైఎస్సార్ ప్రతిపాదించిన 5 శాతం రిజర్వేషన్లనే కోర్టు అనుమతించనపుడు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముస్లింలకు కేసీఆర్ ఎలా హామీనిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషితో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.