‘ఫేక్ న్యూస్’ ఫ్యాక్టరీ ఓనర్లు చంద్రబాబు..లోకేష్’!
సోషల్ మీడియాలో చాలా మంది ఇష్టానుసారం రాసేస్తున్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తే సహించేదిలేదు. ఇవీ పలు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన వ్యాఖ్యలు. కొన్ని సార్లు వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు కొంత మంది పెడుతున్న మాట వాస్తవమే. అలాంటి వారిపై చర్యలు తీసుకున్నా ఎవరూ ఆక్షేపణ చెప్పరు. కానీ సాక్ష్యాత్తూ ఓ ముఖ్యమంత్రి, మంత్రులే ‘ఫేక్ న్యూస్’ ఫ్యాక్టరీని రన్ చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్లు చెప్పే ఫేక్ న్యూస్ నే ప్రధాన మీడియా అంతా అద్భుతంగా అచ్చేస్తే ప్రజలకు నిజాలు తెలిసేది ఎలా?. అసలు చంద్రబాబు ప్రచారం చేస్తున్న ‘ఫేక్ న్యూస్’ ఏంటి?. వాస్తవాలు ఏంటి మచ్చుకు కొన్ని అంశాలు పరిశీలిద్దాం.
- అమరావతి బాండ్లకు అద్భుత స్పందన రావటానికి చంద్రబాబు ఇమేజే కారణం. అమరావతిపై ఎంత నమ్మకం ఉంటే బాండ్లు జారీ చేసిన కొన్ని గంటల్లోనే అలా అమ్ముడుపోతాయి. ఇదీ ప్రభుత్వ ప్రచారం.
వాస్తవం: అమరావతి బాండ్లకు రేటింగ్ తక్కువగా వచ్చింది కాబట్టే అధిక వడ్డీ రేటు ఇవ్వాల్సి వచ్చింది. ఇది అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారాయణ చేసిన ప్రకటన. అధిక వడ్డీ ఇవ్వటంతో పాటు ప్రభుత్వం గ్యారంటీ ఇఛ్చినప్పుడు ఇందులో చంద్రబాబు గొప్ప..ఆయన ఇమేజ్ పనికొచ్చింది ఎక్కడ?. అత్యంత సేఫ్ గా అధిక వడ్డీ రావటమే బాండ్ల సక్సెస్ కు కారణం తప్ప..అందులో చంద్రబాబు, లోకేష్ ల ఇమేజ్ ఏమీ లేదు.
- నా ఇమేజ్, క్రెడిబులిటీ చూసే సింగపూర్ ప్రభుత్వం అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ అతి తక్కువ రోజుల్లో అందజేసింది. ఇదీ చంద్రబాబు మాట.
వాస్తవం: అదే నిజం అయితే సుర్భానా సంస్థకు మాస్టర్ ప్లాన్ కోసం పది కోట్ల రూపాయల వరకూ ఎందుకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది. సుర్భానా మాస్టార్ ప్లాన్ తయారుకు పదుల సంఖ్యలో అధికారులు ప్రభుత్వ ఖర్చుతో సింగపూర్ పర్యటనలు ఎందుకు చేయాల్సి వచ్చింది. ఉచితంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ అనేది ఫేక్. టెండర్ పిలిచి మాస్టర్ ప్లాన్ కు సంస్థలను ఆహ్వానించినా..ఇంత కంటే తక్కువలో పని పూర్తయ్యేది.
- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ కంపెనీలు ముందుకొచ్చాయి. అదీ నాకున్న ఇమేజ్. స్లమ్స్ కట్టాలంటే సింగపూర్ కంపెనీలు అక్కర్లేదు. దేశీయ కంపెనీలు చాలు. అంతర్జాతీయ స్థాయి నగరం నిర్మించాలంటే అత్యంత సాంకేతిక నైపుణ్యం గల సింగపూర్ కంపెనీలు రావాలి. ఇదీ చంద్రబాబు మాట.
వాస్తవం: రాజధాని నిర్మాణం అంటే ఎవరికి తెలిసి అయినా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు. మరి సచివాలయం, హైకోర్టుతో పాటు రాజధానిలో గృహ నిర్మాణాల బాధ్యతను దేశీయ సంస్థలకు ఎందుకు అప్పగించినట్లు?. మరి చంద్రబాబు ఇమేజ్ చూసి రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చిన సింగపూర్ సంస్థలు ఎందుకు వెనక్కిపోయాయి. సచివాలయ నిర్మాణ బాధ్యతలను దేశీయ కంపెనీలకే ఎందుకు అప్పగించారు?.
- ఐక్యరాజ్య సమితికి చెందిన ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ఈపీ) ఆహ్వానాన్ని ఏకంగా ఐక్యరాజ్యసమితి ఆహ్వానంగా ప్రచారం చేసింది టీడీపీ టీమ్. ఏకంగా మోడీకి కూడా దక్కని ఆహ్వానం చంద్రబాబు దక్కిందనే విధంగా కలరింగ్ ఇచ్చారు.
వాస్తవం: నిజంగా ఐక్యరాజ్య సమితి, లేదా ఆ సంస్థకు చెందన ఏజెన్సీ ఆహ్వానం పంపితే అతిధికి విమాన టిక్కెట్లతో పాటు బస ఏర్పాట్లు కూడా ఆ సంస్థే చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం జీవో ఇఛ్చి ఖర్చులను ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ)నే భర్తిస్తుందని పేర్కొనటంతోనే ఇందులో అసలు విషయం బహిర్గతం అయింది. ఇది వచ్చిన ఆహ్వానం కాదు..తెచ్చుకున్నదే అని.
- చైనాలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ సమావేశానికి దేశంలో ఎవరికీ ఆహ్వానం రాలేదు. ఈ ఘనత ఏపీ ఐటి, పంచాయతీరాజ్ ల శాఖ మంత్రి నారా లోకేష్ ఒక్కరికే దక్కింది. ఇదీ లోకేష్ సత్తా. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారం.
వాస్తవం. ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) అసోసియేట్ మెంబర్ గా చేరింది. దీనికి భారీ మొత్తంలో నిర్దేశిత మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఫీజు చెల్లించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి బృందం హాజరవటానికి అనుమతిస్తారు. అందులో భాగంగానే నారా లోకేష్ ఈ సమావేశంలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది తప్ప..అందులో ఎలాంటి ప్రత్యేకత లేదు. అంటే ప్రజల డబ్బు వెచ్చించి అసోసియేట్ మెంబర్ గా చేరి..అందులో ఏదో గొప్పగా ఒక్క లోకేష్ కే ఆహ్వానం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
- అసలు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుందో మాకు చెప్పండి. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించాం. హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎవరు చెప్పారు? ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు అందరూ ముక్తకంఠంతో బిజెపితో కలసి ఉన్నంత కాలం విన్పించిన వాదన.
వాస్తవం: ప్రత్యేక హోదాతో ఏమీ రాదన్నప్పుడు మళ్ళీ ఎందుకు మాట మార్చాలి?. ప్యాకేజీతోనే అన్నీ వచ్చినప్పుడు యూ టర్న్ తీసుకుని హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయి..అన్నీ వస్తాయి అని ఎందుకు చెబుతున్నారు?. హోదాతో అన్నీ వస్తాయని మధ్యలో ఎవరు చంద్రబాబు, లోకేష్ లతో పాటు టీడీపీని ‘ఎడ్యుకేట్’ చేశారు. తొమ్మిదేళ్లు సీఎం, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఆ మాత్రం బ్రీఫ్ చేసే అధికార యంత్రాంగం లేదా?. లేక ప్రజలు తాము ఏది చెపితే అదే నమ్ముతారన్న ధీమానా?. ప్రత్యేక హోదాతో లాభం ఉండదు అన్నది ఫేక్ న్యూసా? లేక ప్యాకేజీతో బెటర్ అన్నది ఫేక్ న్యూసా?. చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే ఆ లైనే కరెక్ట్ అనే ఎంపిక చేసిన మీడియా సంస్థల లైన్ కరెక్టా?
ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం చేసిన ‘ఫేక్ న్యూస్’ ఎన్నో. మరి ఫేస్ బుక్ లో ఎవరో వ్యక్తులు రాసే ఫేక్ న్యూస్ పై మండిపడే వాళ్లు..ప్రభుత్వంలో ఉండి మరీ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తే ప్రజలు ఏమి చేయాలి?.