Telugu Gateway
Telangana

అభ్యర్ధుల ప్రకటనపై కెసీఆర్..కెటీఆర్ ల మధ్య విభేదాలు?!

అభ్యర్ధుల ప్రకటనపై కెసీఆర్..కెటీఆర్ ల మధ్య విభేదాలు?!
X

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ లోనే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసీఆర్. మొత్తం 70 మంది అభ్యర్దులను తొలి విడతలో ప్రకటించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ జాబితా అంశంపై పార్టీ అధినేత కెసీఆర్, మంత్రి కెటీఆర్ ల మధ్య విభేదాలు నెలకొన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ జాబితాలో మార్పులు,చేర్పులు చేయాల్సిందిగా కోరటం..అందుకు కెసీఆర్ అంగీకరించలేదని సమాచారం. రెండు రోజుల క్రితం ఈ అంశంపై వీరిద్దరి మధ్య ఒకింత వాదన కూడా జరిగినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల సంగతి ఏమో కానీ..అభ్యర్దుల ప్రకటన..సిట్టింగ్ ల కు సీట్ల కటింగ్ రాజకీయంగా పెద్ద దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కెసీఆర్ ఓ నలుగురు లేదా ఐదుగురికి మాత్రం సీట్లు దక్కవని పైకి చెబుతునా..ఈ సంఖ్య 20 నుంచి 25 వరకూ చేరటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. నిజంగా కెసీఆర్ చెప్పినట్లు ఐదుగురికి మాత్రం సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వకుండా మిగిలిన వారందరికీ ఇస్తే ఆ నిర్ణయం టీఆర్ఎస్ కు ఝలక్ ఇవ్వటం ఖాయం అని చెబుతున్నారు.

అలా అని 20 నుంచి 25 మంది అభ్యర్ధులను మార్చినా రాజకీయంగా ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా పార్టీపై ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ పేరుతో హంగామా సాగుతున్నా పార్టీలో అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు మాత్రం హాట్ హాట్ గా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రారంభం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి..నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్ రావును ప్రగతి నివేదన సభ విషయంలో పూర్తిగా పక్కన పెట్టడంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హరీష్ రావు వంటి వ్యక్తినే పక్కన పెట్టిన కెసీఆర్ కు తమలాంటి వారు ఓ పెద్ద లెక్కా? అని ఓ నేత వ్యాఖ్యానించారు. తొలి దఫా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కెసీఆర్ మంత్రులు..ఎమ్మెల్యేలనే ఏ మాత్రం పట్టించుకోలేదని.. మళ్ళీ రెండవ సారి గెలిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటందో అని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it