జగ్గారెడ్డి కేసు..రాజకీయ రగడ

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఆయనపై కేసు నమోదు నిజమే అయినా..ఎప్పుడో 2004 కేసును తీసుకొచ్చి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన్ను అరెస్టు చేయటం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. అసలు ఇంత కాలం ఈ కేసులో పోలీసులు ఏమి చేశారన్నదే అసలు చర్చ. అసెంబ్లీ రద్దు అయి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డిని అరెస్టు చేయటంతో ఆ పార్టీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. అందుకే అర్థరాత్రి అయినా సరే డీజీపీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని ఆరోపించారు. అదే సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి హరీష్ లపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పు...కేవలం రాజకీయ లక్ష్యంతోనే తనను అరెస్టు చేశారని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ తర్వాత తనను టార్గెట్ చేశారని అంటున్నారు జగ్గారెడ్డి. అసలు ఈ కేసు విషయం ఏమిటంటే..2004లో జగ్గారెడ్డి బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు.
పాస్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో నార్త్ జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి పటాన్చెరు ప్రాంతంలో ఉన్న జగ్గారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మార్కెట్ పోలీసులకు అప్పజెప్పారు. మరో బృందం మెదక్ జిల్లాలో ఉన్న ఆయన అనుచరుడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించింది. వారు అక్రమ రవాణా చేసిన గుజరాతీయులు ఎవరనేది గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ గుజరాతీయులు అమెరికాలోనే ఉన్నట్లు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఏ దళారుల ద్వారా జగ్గారెడ్డి ఈ అక్రమ రవాణాకు అంగీకరించారు.. ప్రతిఫలంగా ఆయనకు ఏం దక్కింది తదితర అంశాలను విచారిస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు.